మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ లక్ష్యాలకనుగుణంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి సీఎస్ సంజయ్ జాజు వివిధ ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగం లక్ష్యాల సాధనపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడారు. పీఎం శ్రీ పాఠశాలల్లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. పాఠశాలల్లోని గ్రంథాలయాల్లో విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంపొందించేలా పుస్తకాలు అందుబాటులో ఉంచాలన్నారు. గ్రామాల్లో వ్యక్తిగత ఇంకుడు గుంతలు, బోర్ వెల్ రీఛార్జ్, పంట కుంటల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అదే విధంగా భూసేకరణ ప్రక్రియలో పెండింగ్ అంశాలను పరిష్కరించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. చేయూత పింఛన్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న పరిశీలన ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్నారు. జలసిరి పనుల పూర్తిపై ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, డీఈఓ రాజు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతిమాసింగ్


