రామచంద్రాపురం(పటాన్‌చెరు): జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో టీయూడబ్ల్యూజే– ఐజేయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు కృషి చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. బ్లాక్ మెయిలింగ్ వంటి చర్యలకు పాల్పడకుండా వృత్తి గౌరవాన్ని కాపాడాలన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంపై జిల్లాస్థాయిలో పూర్తి వివరాలు సేకరించాలన్నారు. రెండు, మూడు రోజుల్లో ఆ వివరాలను ప్రభుత్వానికి అందించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మెట్రో రైలు, ఆర్టీసీ పాస్‌లకు సంబంధించిన జర్నలిస్టుల సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. అనంతరం ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యుడు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ.. ఢిల్లీలో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి దీపావళి సందర్భంగా అర్హతను బట్టి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే– ఐజేయూ రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రాంనారాయణ, ఉపాధ్యక్షుడు ఫైజల్, జిల్లా అధ్యక్షుడు యాదిగిరి, ప్రధాన కార్యదర్శి అనిల్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు సయ్యద్ ఆసీఫ్ తదితరులు పాల్గొన్నారు.


