● అకౌంట్లో నిధులు జమ అయినట్లు సందేశం ● బ్యాంకులకు క్యూ కట్టిన రైతులు ● టెక్నికల్ సమస్య అంటున్న అధికారులు
అల్లాదుర్గం(మెదక్)/రేగోడ్(మెదక్): రైతు భరోసా నిధులు బ్యాంకు ఖాతాలో జమయ్యాయంటూ బుధవారం ప్రభు త్వం నుంచి సెల్‌ఫోన్లకు వచ్చిన మెసేజ్ చూసి రైతులు బ్యాంకులకు క్యూ కట్టారు. తీరా అకౌంట్‌ను పరిశీలించగా ఒక్క పైసా పడలేదు. దీంతో నిరాశగా ఇంటికి చేరుకున్నారు. అల్లాదుర్గం, అప్పాజీపల్లి తదితర గ్రామాలతో పాటు రేగోడ్ మండలంలోని రైతులకు ఇలాంటి మేసేజ్‌లు వచ్చాయి. ప్రభుత్వం రైతులను మోసం చేసేందుకే ఇలాంటి మేసేజ్‌లు పంపిస్తుందని అప్పాజీపల్లి సర్పంచ్ రవి ఆరోపించారు. ప్రస్తుతం ఈ మేసేజ్‌లు వాట్సాప్‌లో వైరల్ అవుతున్నాయి. కాగా, అప్పులు తీర్చుకోవచ్చని, వ్యవసాయ అవసరాలకు ఉపయోగించుకోవచ్చని గంపెడాశతో బ్యాంకులకు వెళ్లిన రైతులకు నిరాశే ఎదురైంది. ఇదే విషయమై వ్యవసాయాధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా.. వ్యవసాయ శాఖలో సాంకేతిక లోపంతో మేసేజ్‌లు వచ్చినట్లు తెలిపారు. ఈ విషయం జిల్లా అధికారులు ధ్రువీకరించినట్లు చెప్పారు. ప్రభుత్వం రైతు భరోసా వేసే ముందు ప్రకటన జారీ చేయడంతో పాటు సమావేశాలు ఏర్పాటు చేస్తుందన్నారు.


