‘కరువు’పై సర్వే | - | Sakshi
Sakshi News home page

‘కరువు’పై సర్వే

Nov 4 2026 7:58 AM | Updated on Nov 4 2026 7:58 AM

లెక్కలేని లోటు వర్షపాతం

ప్రత్యేక యాప్‌లో నమోదు

ఈ సర్వేతోనైనా

కరువు మండలాలు పెరిగేనా?

ఎల్‌నినోతో ఈ ఏడాది జిల్లాలో వర్షపాతం అంతంతమాత్రంగానే నమోదైంది. పంటలకు నీటి తడులు కీలకమైన దశలో వర్షాలు ముఖం చాటేశాయి. దీనికితోడు విద్యుత్‌

అంతరాయాలు ఉత్పన్నం కావటంతో వరితోపాటు అనేక రకాల పంటలు ఎండిపోయాయి. కొందరు జనరేటర్లను ఏర్పాటు చేసుకోగా మరికొందరు ఏకంగా ట్యాంకర్ల ద్వారా నీటి తడులు అందించినప్పటికీ వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. జిల్లావ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. అయితే అధికారులు మాత్రం విడ్డూరంగా కేవలం ఒకే ఒక్క మండలాన్ని కరువుగా

ప్రకటించారు. అయితే సర్వత్రా ఆందోళనలతో ఇప్పుడు ఎండిన పంటలను సర్వేచేసి ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించటంతో అధికారులు సర్వే ప్రారంభించారు. – మెదక్‌జోన్‌

మెతుకు సీమ ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. ఇక్కడ 95% ప్రజలకు వ్యవసాయమే ఆధారం. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 3,63,019 ఎకరాలలో వివిధ రకాల పంటలను సాగు చేశారు. ఇందులో 2,94,532 ఎకరాల్లో వరి, 34,279 ఎకరాల్లో పత్తి సాగు చేయగా, మొక్కజొన్న, కందులు, పెసర్లు, కూరగాయలు, ఇతర పంటలు మొత్తం 34,208 ఎకరాలలో సాగు చేశారు. ఇందులో ఎప్పటిలాగే సింహభాగం వరి పంటను సాగు చేశారు. కాగా, వర్షాకాలంలో జూన్‌, సెప్టెంబర్‌లలో లోటు వర్షపాతం కాగా,జూలై, ఆగస్టులలో సాధారణ వర్షపాతం నమోదైంది. ఫలితంగా వేలాది ఎకరాలలో వరిపంటలు దెబ్బతిన్నాయి.

జిల్లాలో 21 మండలాలు ఉండగా మనోహరబాద్‌, చిలప్‌చెడ్‌, నర్సాపూర్‌ మండలాల్లో లోటు వర్షం నమోదైంది. కానీ అధికారులు మాత్రం ఒక్క మనోహరబాద్‌ మండలాన్నే కరువు మండలంగా ప్రకటించి చేతులు దులుపుకున్నారు. చిలప్‌చెడ్‌, నర్సాపూర్‌ మండలాల్లో సగం పంటలు ఎండిపోయినా పరిగణలోకి తీసుకోలేదు. నిబంధనల ప్రకారం నిరంతరంగా 15 రోజులపాటు వర్షం కురవకుంటేనే కరువుగా ప్రకటిస్తారని అందులో భాగంగానే మనోహరబాద్‌ను కరువు మండలంగా గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా మండలాల్లో చిరుజల్లులు కురిసి కురవాల్సిన వర్షం కురవకున్నా, కరువుగా ప్రకటించలేదు. కరువుపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుండటంతో ప్రభుత్వం ఎండిన పంటలను పరిగణలోకి తీసుకుని సర్వే చేయాలని ఆదేశించటంతో అధికారులు పంటల సర్వేను ప్రారంభించారు.

దెబ్బతిన్న పంటల వివరాల

సేకరణలో అధికారులు

బాధిత రైతుల్లో ఆశలు

జిల్లాలోని అన్ని మండలాల్లో ఎండిన పంటలను సర్వే చేసి ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాలని ప్రభుత్వ స్పష్టంగా పేర్కొంది. ఈ ఆదేశాల మేరకు సంబంధిత వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే ప్రారంభించారు. ప్రతీ గ్రామంలో రైతులు సాగు చేసిన పంట ఎంత..? ఏయే రకాలు సాగు చేశారు? అందులో ఎండిపోయిన పంట ఎంత..? వంటి వివరాలు క్లుప్తంగా తెలుసుకుని యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించటంతో క్షేత్రస్థాయిలో ఎండిన పంటలను సర్వే చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కాగా, ఈ సర్వే అనంతరం కరువు మండలాలు పెరగటంతోపాటే ఎండిన పంటలకు పరిహారం వస్తుందా అంటూ పలువురు రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా, ఎండిన పంటలెక్క తేలాక మరోసారి కరువును ప్రకటించే వీలు ఉండొచ్చని సంబంధిత వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement