● తహసీల్దార్లు చిత్తశుద్ధితో పనిచేయాలి ● భూ రీ సర్వేతో రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం ● కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ కలెక్టరేట్: రెవెన్యూ సేవల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని, తహసీల్దార్లు చిత్తశుద్ధితో పారదర్శకంగా పనిచేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో మంగళవారం భూధార్, ల్యాండ్ రీ సర్వే, ధాన్యం కొనుగోలు, ట్రిపుల్‌ఆర్, ప్రజావాణి పెండింగ్ సమస్యలు, సంబంధిత రెవెన్యూ అంశాలపై ఆర్డీఓలు తహసీల్దార్లతో కలెక్టర్ చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...భూముల సమగ్ర రీ–సర్వే భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతుందన్నారు. భూ రికార్డుల్లో పారదర్శకతను పెంచేందుకు చేపడుతున్న రీ–సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, లైసెన్స్‌డ్ సర్వేయర్లపై కఠిన చర్యలు ఉంటాయని, అవసరమైతే సస్పెన్షన్ వేటు వేస్తామని హెచ్చరించారు. ఆధార్ కార్డు తరహాలోనే ప్రతీ భూ భాగానికి 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య భూదార్ నంబర్‌ను కేటాయించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. రీ–సర్వే ఆధారంగా భూదార్ నంబర్, ల్యాండ్ బేస్డ్ మ్యాప్ అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. పెండింగ్ కోర్టు కేసులు– రెవెన్యూ వివాదాలు, ముఖ్యంగా అటవీ, రెవెన్యూ శాఖల మధ్య సరిహద్దు వివాదాలున్న భూములను సర్వే చేసి శాసీ్త్రయ పద్ధతిలో సరిహద్దులను ఖరారు చేయాలని పేర్కొన్నారు.
జీవో 59 ప్రకారం క్రమబద్దీకరణ
ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న అర్హులైన పేదలకు జీవో 59 కింద ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియ పురోగతిని కలెక్టర్ ప్రతిమాసింగ్ సమీక్షించారు. క్షేత్రస్థాయి పరిశీలనను క్షుణ్ణంగా పూర్తిచేసి, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నిజమైన లబ్ధిదారుల దరఖాస్తులను మాత్రమే ఆమోదించాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. వెల్దుర్తి మండల తహసీల్దార్ సర్వే నిర్వహణ తీరు తెలియకపోవడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఆ తహసీల్దార్ చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్‌ను ఆదేశించారు. అనంతరం ట్రిపుల్‌ఆర్, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్షించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ అంబదాస్ రాజేశ్వర్, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.


