జాబితాలో అనర్హుల పేర్లు ! | - | Sakshi
Sakshi News home page

జాబితాలో అనర్హుల పేర్లు !

Nov 4 2026 7:58 AM | Updated on Nov 4 2026 7:58 AM

విమర్శల పాలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గతంలో లబ్ధిపొందిన వారికీ తాజా జాబితాలో మళ్లీ ఇళ్లు స్థానికేతరులకు, పొలాలున్న వారికీ ఇళ్లు మంజూరు

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కేటాయించేందుకు రెవెన్యూ అధికారులు రూపొందించిన అర్హుల జాబితాలో అనర్హుల పేర్లు ఉండటంతో అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒక్కో వార్డులో ఒక్కోతీరుగా అర్హుల జాబితా ఉందని, స్థానికేతరులు, గతంలో ఇందిరమ్మ ఇళ్లు పొందిన వారికి కూడా మళ్లీ ఇళ్లను అధికారులు మంజూరు చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

నర్సాపూర్‌: మున్సిపాలిటీ పరిధిలో సుమారు తొమ్మిదేళ్ల క్రితం గత ప్రభుత్వ హయాంలో ఐదు వందల డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను నిర్మించారు. వాటిలో 252 ఇళ్ల నిర్మాణ పనుల్లో మేజర్‌ పనులు పూర్తవగా చిన్న చిన్న పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలిన 248 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. కాగా ప్రస్తుత ప్రభుత్వం వివిధ దశల్లో ఉన్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను అర్హులకు కేటాయించి ఇంటి నిర్మాణాలను లబ్ధిదారులే పూర్తి చేసుకోవాలని నిర్మాణ వ్యయం బిల్లును లబ్ధిదారులకు అందజేసే విధంగా అధికారులు ప్రణాళిక తయారు చేశారు. అందుకు గాను అర్హులైన పేదవారిని గుర్తించి ఎంపిక చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.

914 మంది పేర్లతో జాబితా

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు పంపిణీ చేస్తారని అధికారులు ప్రకటించడంతో 2,400 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే అర్హులను ఎంపిక చేసి జాబితా రూపొందించే బాధ్యతను జిల్లా రెవెన్యూ యంత్రాంగం చేపట్టింది. దరఖాస్తులను విచారించి పనులను జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన డిప్యూటీ తహసీల్దార్లు, మండల ఆర్‌ఐలు విచారణ చేసి వారిలో 914మందితో అర్హుల జాబితా తయారు చేశారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు 500 మాత్రమే ఉన్నాయి. దీంతో డ్రా పద్ధతిన జాబితాలోని వ్యక్తులకు ఇళ్లను కేటాయించాలని అధికారులు నిర్ణయించారు.

అర్హుల జాబితాపై ఆరోపణలు

రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు రూపొందించిన అర్హుల జాబితాలో చాలామంది అనర్హుల పేర్లు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. పట్టణంలోని పాత ఏరియాలోని రెండు వార్డులలో ఇందిరమ్మ ఇళ్లు పొంది ఇళ్లను నిర్మించుకున్న ముగ్గురి పేర్లను డబుల్‌ బెడ్‌ రూం లబ్ధిదారుల అర్హుల జాబితాలో చేర్చడం గమనార్హం. టేక్మాల్‌ మండలంలో రేషన్‌కార్డు కలిగిన ఓ మహిళ పేరుతోపాటు మనోహరబాద్‌కు చెందిన వ్యక్తి పేరు, పక్కా ఇళ్లు, వ్యవసాయ పొలం కలిగిన వ్యక్తుల పేర్లు అర్హుల జాబితాలో ఉండటంతో ఆశావహ లబ్ధిదారులు నోరెళ్లబెడుతున్నారు. మెయిన్‌రోడ్డుకు ఆనుకుని ఉన్న రెండు వార్డుల అర్హుల జాబితాలో సుమారు 15 మంది స్థానికేతరుల పేర్లతోపాటు పక్కా ఇళ్లు కలిగిన వ్యక్తుల పేర్లు ఉన్నాయని తెలిసింది. ఇలా అవతవకలతో అధికారులు రూపొందించిన ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాను మరోసారి విచారణ చేసి నిజమైన అర్హులకే కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు.

విచారణ చేస్తాం

ప్రస్తుత డబుల్‌ బెడ్‌ రూం అర్హుల లిస్తు తుది జాబితా కాదు. దీనిపై ఆక్షేపణలు, అభ్యంతరాలు తెలుసుకునేందుకు పలు కార్యాలయాల వద్ద నోటీసు బోర్డుల్లో పెట్టాం. ఇప్పటికే పలు ఆక్షేపణలు వచ్చాయి. వాటిని పరిశీలించి మరోసారి విచారణ జరిపిస్తాం. నిజమైన పేదలను గుర్తించి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటాం.

రామకృష్ణ, ఆర్‌డీఓ, నర్సాపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement