మెదక్ కలెక్టరేట్: జిల్లాలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అడివయ్య డిమాండ్ చేశారు. సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించిన అనంతరం డీఆర్‌ఓ అంబదాస్ రాజేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దసరా, బతుకమ్మ ఉత్సవాల వేళ మనోహరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో దళితులపై దాడులు, కులవివక్ష ఘటనలు చోటుచేసుకున్నా జిల్లా అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు, విచారణలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఈ దాడులపై కలెక్టర్, ఎస్పీలు తక్షణమే స్పందించి ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని కోరారు. కోనాయపల్లి బాధితులకు మద్దతుగా నవంబర్ 5న తుప్రాన్ డీఎస్పీ కార్యాలయానికి చేపట్టే పాదయాత్రకు, నవంబర్ 11, 12 తేదీలలో కలెక్టరేట్ ఎదుట నిర్వహించే 48 గంటల నిరాహార దీక్షకు సీపీఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


