చేగుంట(తూప్రాన్): మండల కేంద్రమైన చేగుంటలో నిర్వహిస్తున్న దేశాయి బీడీ పరిశ్రమను తరలించొద్దని బీడీ కార్మిక సంఘం నాయకుడు ఉప్పు లక్ష్మణ్ ఆధ్వర్యంలో మేనేజర్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేగుంటలో నిర్వహిస్తున్న దేశాయి బీడీ పరిశ్రమకు అందించే బీడీలను నిజాంపేట మండల కేంద్రంలోని దేశాయి బీడీ కార్యాలయానికి వచ్చే జనవరి 1నుంచి తీసుకురావాలని టేకేదార్లకు యాజమాన్యం సూచించినట్లు తెలిపారు. చేగుంట పరిదిలోని టేకేదార్లు నిజాంపేటకు బీడీలు తీసుకెళ్లేందుకు 50 కిలోమీటర్లు వెళ్లాలని తెలిపారు. దాదాపు వంద కిలోమీటర్లు తిరగడం టేకేదార్లకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నందున చేగుంట బీడీ సెంటర్‌ను తరలించొద్దని బ్రాంచ్ మేనేజర్ సంజయ్‌కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన టేకేదార్లు, కార్మికులు పాల్గొన్నారు.


