హవేళిఘణాపూర్ (మెదక్): విద్యుత్ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ విద్యుత్ శాఖ కార్యాలయంలో కన్జ్యూమర్ల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వాటిని పరిష్కరించనున్నట్లు విద్యుత్ శాఖ ఎస్‌ఈ నారాయణ నాయక్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు, అధిక బిల్లుల సవరణ, ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు, నూతన స్తంభాల ఏర్పాటు వంటి సమస్యలపై వినతులు స్వీకరించి పరిష్కరిస్తామని వెల్లడించారు. మంగళవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లాలోని తూప్రాన్, మెదక్ సూపరింటెండెంట్ సబ్ డివిజన్ కార్యాలయాల్లో ప్రత్యేక సదస్సులు నిర్వహించి ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
బస్సు సౌకర్యం కల్పించండి
తూప్రాన్: ఆయా గ్రామాలకు నూతన బస్సు సౌకర్యాన్ని కల్పించాలని కోరుతూ సోమవారం నర్సాపూర్ డిపో మేనేజర్ రామ్మోహన్‌కు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సాపూర్ నుంచి చిన్నగోటిముక్ల, గోమారం మీదుగా గౌతోజిగూడ, పర్కిబండ, పోతారం మీదుగా తూప్రాన్–గజ్వేల్ వరకు బస్సు సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా వారు అధికారులను కోరారు. ఈ వినతిపత్రం సమర్పించిన వారిలో పర్కిబండ సర్పంచ్ మోతీభాయి లక్ష్మణ్ సింగ్, ఉప సర్పంచ్ మహేష్, పోతారం మాజీ సర్పంచ్ మాధవరెడ్డి, మెదక్ జిల్లా ఉప సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు పంచమి రేణు కుమార్ పాల్గొన్నారు.
ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
పెద్దశంకరంపేట(మెదక్): ప్రతీ సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ నారాయణ, ఇన్‌చార్జి ఎంపీడీఓ షాకీర్‌అలీలు సూచించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు.
ప్రజావాణిలో రెండు దరఖాస్తులు
నిజాంపేట(మెదక్): మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం సీనియర్ అసిస్టెంట్ కరిముల్లా ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ, రెవెన్యూ శాఖలకు సంబంధించి మొత్తం రెండు దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.


