చిన్నశంకరంపేట (మెదక్): ధాన్యానికి మద్దతు ధర కంటే ఎక్కువ మార్కెట్ ధర లభిస్తుండటంతో రైతులు తమ పంటను నేరుగా రైస్ మిల్లుల వద్దకే తరలిస్తున్నారు. చిన్నశంకరంపేట మండల పరిధిలోని పలు రైస్ మిల్లుల వద్ద వరి ధాన్యంతో వచ్చిన ట్రాక్టర్లు భారీగా బారులుతీరాయి. రైస్ మిల్లు నిర్వాహకులు ప్రస్తుతం సన్న ధాన్యం క్వింటాకు రూ.3,400 వరకు చెల్లిస్తుండటంతో రైతులు క్యూ పద్ధతిలో ధాన్యపు లోడ్లను కాంటా వేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర రూ.2,460తో పాటు క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తున్నప్పటికీ, బహిరంగ మార్కెట్‌లో సన్న ధాన్యానికి మంచి డిమాండ్ ఉండటంతో వ్యాపారులు నేరుగా కల్లాల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. గతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తూకాలు, గన్నీ బ్యాగుల కొరత, చెల్లింపుల ఆలస్యం వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అయితే ఈసారి మిల్లుల వద్ద తక్షణమే మెరుగైన ధర లభిస్తుండటంతో నేరుగా మిల్లుల వద్దకే ధాన్యాన్ని తరలిస్తున్నారు. కాగా, గతంలో క్వింటాకు రూ.3,800 నుంచి రూ.4,000 వరకు పలికిన ధర, ప్రస్తుతం రూ.3,400 వరకు పలుకుతోందని రైతులు తెలిపారు.
రైస్ మిల్లుల వద్ద ట్రాక్టర్ల బారులు


