చేగుంట(తూప్రాన్): ఉమ్మడి చేగుంట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని దుబ్బాక ఎమ్మె ల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని రాంపూర్, ఇబ్రహీంపూర్, పులిమామిడి, కిష్టాపూర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో దుబ్బాక నియోజకవర్గంలోని రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. ఇప్పటికే బోర్లలో నీళ్లు రాక, విద్యుత్ సరఫరా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో చేగుంట, నార్సింగి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. మండలంలోని లంబాడీ తండాల్లో నివసించే గిరిజన కుటుంబాలకు కూలీ పనులు దొరకక వారి జీవనోపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మెదక్ కలెక్టర్ చేగుంట, నార్సింగి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి


