మెదక్ జోన్: దళితులపై దాడులు చేసిన వారిని శిక్షించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. శనివారం ప్రజా సంఘాల సభ్యులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మనోహరాబాద్ మండలం కోనాయిపల్లి గ్రామ దళితులపై దాడి చేసిన వారిని శిక్షించకుండా విచారణలో నిర్లక్ష్యం చేస్తున్న అధికారులను మార్చి ఇతర అధికారులచే విచారణ చేపట్టాలన్నారు. దాడులపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ నోరువిప్పకపోవడం దారుణమన్నారు. నవంబర్ 5న కోనాయిపల్లి నుంచి తూప్రాన్ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 11,12వ తేదీల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేపట్టాలని తీర్మానించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు అడివయ్య, సీఐటీయూ కార్యదర్శి మల్లేశం, ఎన్‌పీఆర్‌డీ జిల్లా కార్యదర్శి యశోద, డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సంజీవులు, బీఎస్పీ రాష్ట్ర నాయకులు సురేశ్, కె.మల్లేశం పాల్గొన్నారు.


