ముమ్మరంగా వరికోతలు
కౌడిపల్లి (నర్సాపూర్): రైతుల్లో అర్నబ్ తుఫాన్ భయం పట్టుకుంది. బంగాళాఖాతంలో అర్నబ్ తుఫాన్ ఏర్పడగా ఈ నెల 28న ఏపీఓ తీరం దాటనుంది. తెలంగాణలోని కొన్ని జిల్లాలో తూఫాన్ ప్రభావం ఉంటుందని, మెదక్ జిల్లాలో తుఫాన్ ప్రభావం అంతగా ఉండదని చిరుజల్లులు కురిసే అవకాశం మాత్రమే ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ రైతులు మాత్రం ఒకింత ఆందోళన చెందుతున్నారు. మండలంలో 19,900ఎకరాలలో వరి పంటను సాగుచేయగా ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆలస్యంగా వేసిన వరిపంటతోపాటు కోతకు వచ్చిన వరిపంటపై రైతులు తుఫాన్ ప్రభావం ఏవిధంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. వాన కురిస్తే పంటనేలకు వాలడం, వరి కోతలపై ప్రభావం పడుతుందని ముందే కోత కోయాలని రైతులు భావిస్తున్నారు. ఓవైపు సన్నరకం వరిధాన్యానికి మంచి గిట్టుబాటు ధర వస్తుండగా వరికోతలు ముమ్మరమయ్యాయి.


