భూ వివాదాలకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

భూ వివాదాలకు చెక్‌

Oct 27 2026 8:22 AM | Updated on Oct 27 2026 8:22 AM

రైతులు సహకరించాలి

కొనసాగుతున్న డిజిటల్‌ సర్వే

రైతులు సహకరించాలి

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూ సర్వే కొనసాగుతోంది. జిల్లాలో 6.81 లక్షల ఎకరాల భూములుండగా, నక్షలేనివి 50 వేల ఎకరాల పైచిలుకు ఉన్నాయి. వాటిని ముందుగా సర్వే చేస్తున్నారు. ఇందుకోసం 62 మంది సర్వేయర్లు గత 10 నెలలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ భూముల కొలతలు పూర్తయ్యాక మిగితా భూముల సర్వే చేపట్టనున్నారు. – మెదక్‌జోన్‌

జిల్లాలో 492 గ్రామాలుండగా, 393 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వాటి పరిధిలో పట్టా, పరంపోగు, లావాణి, అసైన్డ్‌మెంట్‌, ఈనాం, కేకే, గైరాన్‌, పడీత తదితర రకాలకు చెందిన భూములు 6,81,360 ఎకరాలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో భూప్రక్షాళన పేరుతో సర్వే నిర్వహించి ధరణి పోర్టల్‌లో కొంత భూమిని పొందుపరిచారు. మిగితావి కోర్టు పరిధిలోనివి, తగాదాలున్నవి, లావాణి లాంటి భూములను నిషేధిత జాబితాలో పెట్టారు. దీంతో వేలాది మందికి భూ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దీంతో ధరణిలో ఉన్న భూములకు మాత్రమే రైతుబంధు రావటం, మిగితా భూముల్లో పంటలు పండించినా కొనుగోలు చేయకపోవటం, ఎరువులు లభించకపోవటం లాంటి సమస్యలతో రైతులు సతమతమయ్యారు. ఈ క్రమంలో 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పోర్టల్‌ను రద్దు చేసి భూభారతి పోర్టల్‌ను కొత్తగా ప్రవేశపెట్టింటి. పూర్తిస్థాయిలో అన్నిరకాల భూములను రీసర్వే చేసి భూభారతిలో పొందుపర్చేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ముందుగా నక్షలేని భూములను సర్వే చేస్తున్నారు.

24 గ్రామాలు.. 50 వేల ఎకరాలు

జిల్లావ్యాప్తంగా 393 రెవెన్యూ గ్రామాలుండగా, అందులో నక్షలేనివి 15 మండలాల పరిధిలో 24 గ్రామాల్లో 50 వేల ఎకరాలున్నాయి. వాటిలో జనవరి నుంచి ఇప్పటివరకు 10 గ్రామాల్లో 29 వేల ఎకరాలను సర్వే చేశారు. మిగితా 14 గ్రామాల్లో 21 వేల ఎకరాల సర్వేను ఇటీవలే ప్రారంభించారు. కాగా, జిల్లావ్యాప్తంగా 6,81,360 ఎకరాల భూములుండగా 10 నెలల క్రితం నక్షలేని 50 వేల ఎకరాల్లో సర్వే ప్రారంభించారు. అవి పూర్తయ్యాక మిగితా 6,31,360 ఎకరాల్లో సర్వే చేయనున్నట్లు తెలిసింది.

140 మంది సర్వేయర్లు

జిల్లాలోని 6.81 లక్షల ఎకరాల భూములను రీ సర్వే చేసేందుకు సంబంధిత అధికారులు ఇప్పటివరకు రెండు విడతల్లో 140 మంది సర్వేయర్లను ఎంపిక చేసి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. అందులో మొదటి విడతగా నక్షలో లేని భూములను సర్వే చేసేందుకు 62 మందిని విధుల్లోకి తీసుకున్నారు. ఈ సర్వేలో పాల్గొన్న ఒక్కో సర్వేయర్‌కు ఎకరాకు రూ. 60 చొప్పున ఇస్తున్నట్లు తెలిసింది. ఒక సర్వేయర్‌ రోజుకు 40 నుంచి 50 ఎకరాల భూములను సర్వే చేస్తారని సంబంధిత అధికారి ఒకరు చెప్పారు. వీరికి వారానికోసారి డబ్బులు చెల్లిస్తునట్లు తెలిసింది.

ఇప్పటివరకు 29 వేల ఎకరాల్లో పూర్తి

జిల్లాలో 6.81 లక్షల ఎకరాలపైగా భూములు

నక్షలేనివి 50 వేల పైచిలుకు..

డిజిటల్‌ సర్వేకు ప్రతి రైతు సహకరించాలి. ఇది పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. ఇక భవిష్యత్‌లో ఎలాంటి తగాదాలు లేకుండా సర్వే చేపట్టాం. అనంతరం ఆయా రైతులకు నోటీసులు ఇస్తాం. ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పాలి. లేనట్లు అయితే ఆన్‌లైన్‌లోని భూభారతి పోర్టల్‌లో పొందుపరుస్తాం.

– కిషన్‌, ఏడీ, సర్వే అండ్‌

ల్యాండ్‌ రికార్డ్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement