● ఎల్‌నినోను ఎదుర్కొందాం
● ‘సాక్షి’తో డీఏఓ దేవ్‌కుమార్
యాసంగిలో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ సూచించారు. జిల్లాలో ఎల్‌నినో ప్రభావం, రబీలో పంటల సాగు, నీటి వనరులు తదితర అంశాలపై సోమ వారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయన మాటల్లో..
– మెదక్ కలెక్టరేట్
ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభం నుంచి ఎల్‌నినో ప్రభావం చూపుతుంది. ఇప్పటికే భూగర్భజలాలు తగ్గుముఖం పట్టాయి. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కలెక్టర్ ప్రతిమాసింగ్ జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈసారి యాసంగిలో జిల్లాలోని రైతులను వరి బదులు ఆరుతడి పంటలు వేసుకునే విధంగా చైతన్యం చేస్తున్నాం. అందుకు సంబంధించిన విత్తనాలను అందుబాటులో ఉంచాం. వరి ఎకరం పండించే నీటితో 3 ఎకరాల ఆరుతడి పంటలు పండించవచ్చు. ఈనెలలో వర్షాలు లేక, నీటి తడులు అందక కొన్ని చోట్ల వరి పంట దెబ్బతిని రైతులు ఇబ్బంది పడుతున్నారు. తొందరపడి వరి పంటలు వేసుకోవద్దు.
రైతులకు అవగాహన
ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలోని రైతులు 30 ఎకరాల్లో తరుతడి పంటలు సాగు చేశారు. ఈమేరకు గ్రామాల్లో విస్తృతంగా సదస్సులు ఏర్పాటు చేసి రైతులను చైతన్యం చేస్తున్నాం. వానాకాలం కొంత మార్పు వచ్చింది. అయితే జిల్లాలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. కోతులకు భయపడి రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయడం లేదు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో కోతుల పట్టి నిర్మల్ వైపు తరలిస్తున్నారు. దీంతో రైతులకు ఆందోళన అవసరం లేదు.
100 రోజుల్లో పంటలు చేతికి
మినుములు, పెసర, నువ్వులకు సబ్సిడీ వస్తుంది. మొక్కజొన్న, జొన్న, పొద్దు తిరుగుడు, కుసుమలు, శనగలు వేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. నీటి ఎద్దడి నుంచి తప్పించుకొని అధిక ఆదాయం పొందవచ్చు. కుసుమలు, శనగలు అయితే దాదాపు చలితోనే పండుతాయి. ఆరుతడి పంటలన్నీ 100 రోజుల్లో పూర్తవుతాయి. కేవలం నాలుగైదు నీటి తడులతో పంటలు చేతికి వస్తాయి. జిల్లాలో పొద్దు తిరుగుడు, జొ న్న, మొక్కజొన్న, కందులు, రాగులు, మినుములు, పెసర, సోయాబిన్, కుసుమలు, శనగ విత్తనాలు అ ందుబాటులో ఉన్నాయి. అత్మనిర్భర్ భారత్ పథకం కింద కేంద్రం జొన్న, మొక్కజొన్న, కూరగాయలు, ఆయిల్‌పాం పంటలపై సబ్సిడీ ఇస్తుంది.
అందుబాటులో కేంద్రాలు
రైతులు అధికంగా ఆరుతడి పంటలు వేసుకుంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం జొన్న, మొక్కజొన్న పంటలకు కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ప్రభుత్వం మద్దతు ధర కూడా అందజేస్తుంది. ఫర్టిలైజర్‌షాపులు, పీఎసీఎస్‌లలో విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా రసీదులు పొందాలి. అనుమానం ఉంటే వెంటనే రిటర్న్ చేసి మంచి విత్తనాలు పొందాలి. నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.


