మెదక్‌జోన్: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక మోసాలు, వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించారు. ఆయా సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే వృద్ధుల పట్ల నిర్లక్ష్యం, వేధింపులకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకుముందు ఎస్పీ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్‌సింగ్, డీఎస్పీ రంగనాథ్, సిబ్బంది పాల్గొన్నారు.


