మేల్కొన్న మిల్లర్లు | - | Sakshi
Sakshi News home page

మేల్కొన్న మిల్లర్లు

Oct 22 2026 7:02 AM | Updated on Oct 22 2026 7:02 AM

మేల్కొన్న మిల్లర్లు

ప్రభుత్వానికి కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) బకాయిపడిన మిల్లర్లకు ఎట్టకేలకు జ్ఞానోదయమైంది. సంబంధిత అధికారులు నిరంతరం మిల్లులను తనిఖీలు చేస్తూ ధాన్యం కొరత వచ్చిన వాటిపై అధికారులు కొరడాఝుళిపిస్తూ, కేసులు నమోదు చేస్తుండటంతో బకాయి పడ్డ సీఎంఆర్‌ను తిరిగి చెల్లించేందుకు మిల్లర్లు నడుంబిగించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధరకన్నా రైతుల నుంచి ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 20% ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేశారు. –మెదక్‌జోన్‌

జిల్లావ్యాప్తంగా 2.94 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా అందులో సింహభాగం సన్నాలను సాగు చేశారు. కాగా 2014 నుంచి 2024 వరకు పదేళ్ల పాటూ 17 రైస్‌ మిల్లర్లు ప్రభుత్వానికి సీఎంఆర్‌ బకాయిలు పడ్డారు. వాటిని సకాలంలో ఇవ్వకపోవటంతో 25% ఫైన్‌తో కలిపి సుమారు రూ.100 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. దీంతో వారికి నోటీసులు జారీ చేసి డబ్బులు చెల్లించాలని అధికారులు గడువిచ్చారు. అయినా బకాయిలు చెల్లించకపోవటంతో ఆర్‌ఆర్‌ యాక్ట్‌ ప్రకారం డబ్బులు చెల్లించాలని అధికారులు హెచ్చరించారు. అయినప్పటికీ స్పందనలేకపోవటంతో వారిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వారి మిల్లులు బ్లాక్‌లిస్ట్‌ జాబితాలోకి వెళ్తే మిల్లర్లకు జరిగే నష్టం అంతాఇంతా కాదని పలువురు పేర్కొంటున్నారు. దీంతో మిల్లర్లు ప్రభుత్వాన్ని ఎదిరించటం కన్నా ఉన్న బకాయిలు చెల్లించడమే ఉత్తమమని భావిస్తున్నారు.

గతేడాది రబీ, ఖరీఫ్‌లోనూ బకాయిలు

గత 2025 యాసంగి, వానాకాలంలోనూ కొందరు మిల్లర్లు సీఎంఆర్‌ బకాయిలు పడటంతో వారంతా బకాయిలను క్లియర్‌ చేసుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలిసింది. 2025 రబీలో 100 మిల్లర్లకు ధాన్యం ఇవ్వగా నలుగురు మిల్లర్లు మాత్రమే తిరిగి సీఎంఆర్‌ ఇచ్చారు. ఇంకా 96 మంది ప్రభుత్వానికి బకాయి పడ్డారు. 2025 వానాకాలంలోనూ 101 మంది మిల్లర్లకు సీఎంఆర్‌ ఇవ్వగా ఎనిమిదిమంది మాత్రమే బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించగా ఇంకా 93 మంది మిల్లర్లు బకాయిలు పడ్డారు. వీరి గడువు సైతం దగ్గరికి రావటంతో పాత బకాయిలను చెల్లించాలనే ఆలోచనతో మిల్లర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

మద్దతు ధరను మించి చెల్లింపులు!

ఈ ఏడాది దొడ్డు ధాన్యానికి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,450 కాగా సన్నాలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ కలుపుకుని రూ.2,950 గిట్టుబాటు ధర కల్పించింది. కాగా, మిల్లర్లు సన్నాలను క్వింటాల్‌కు రూ.3,200 నుంచి మొదలుకుని రూ.3,500 వరకు నగదు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ 14%తో తూకం వేయాల్సి ఉంటుంది. కానీ రైతుల వద్ద కోయగానే వచ్చి ధాన్యాన్ని అలాగే కొనుగోలు చేస్తున్నారు. దొడ్డు ధాన్యాన్ని సైతం అధిక ధరలు చెల్లించి మిల్లర్లు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటివరకు 20% కోతలు కాగా ఆ ధాన్యాన్ని మొత్తం మిల్లర్లే కొంటున్నారు. దీంతో రైతులకు మంచి లాభాలు రావటంతో పాటు వెంటనే నగదు రూపంలో డబ్బులు వస్తున్నాయి.

సీఎంఆర్‌ బకాయిలు తీర్చే పనిలో నిమగ్నం

రైతుల నుంచి పోటీపడి ధాన్యం కొనుగోలు

మద్దతు ధరకన్నా ఎక్కువ చెల్లింపులు

ప్రతీ బుధవారం తనిఖీలు

సీఎంఆర్‌ కోసం ప్రతీ బుధవారం ప్రధాన కార్యాలయానికి చెందిన పౌరసరఫరాల విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ధాన్యం కొరత వస్తే వెంటనే మిల్లర్లకు నోటీస్‌లు ఇవ్వటం, కేసులు నమోదు చేసేస్తున్నారు. దీంతో భయోందోళనకు గురైన మిల్లర్లు కొరత ఉన్న ధాన్యాన్ని భర్తీ చేసేందుకు రైతుల నుంచి నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement