● ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు
● మెదక్ లో ఘనంగా దసరా ఉత్సవాలు
మెదక్ కలెక్టరేట్: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమిని జరుపుకుంటామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో విజయ దశమి దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మెదక్ మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేశ్‌గౌడ్‌ల ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే రోహిత్‌రావు హాజరై మాట్లాడారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమిని జరుపుకుంటామన్నారు. మెదక్‌పట్టణ సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని 13 వార్డుల పరిధిలో రూ.7.4 కోట్లతో వివిధ మౌలిక వసతుల పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ప్రధాన ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మెదక్ పట్టణాన్ని ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. వేడుకల్లో భాగంగా భారీ రావణాసురుడి దిష్టిబొమ్మను ఏర్పాటు చేసి దహనం చేశారు. ఈ ఉత్సవాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్ పట్టణంలోని ఇందిరాపురి కాలనీలోని శమీవృక్షాన్ని, పక్కనే ఉన్న అమ్మవారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రజలు ఒకరికొకరు దసరా శుభాకాంక్షలు చెప్పుకుంటూ అలయ్ బలయ్ తీసుకున్నారు. కార్యక్రమంలో దసరా ఉత్సవ కమిటీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.


