కీచకులకు ఊచలే.. | - | Sakshi
Sakshi News home page

కీచకులకు ఊచలే..

Oct 17 2026 7:48 AM | Updated on Oct 17 2026 7:48 AM

● జిల్లాలో ఏడాదిన్నరలో 28 మందికి శిక్ష

● సీరియస్‌గా తీసుకున్న పోలీస్‌శాఖ

● కోర్టులో సరైన సాక్ష్యాధారాల సమర్పణ

● బాధితులకు సత్వర న్యాయం

పోక్సో కేసులను జిల్లా పోలీస్‌శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఏడాదిన్నర కాలంలో జిల్లాలో 28 మంది నిందితులకు కఠిన కారాగార శిక్ష పడటంలో కీలక పాత్ర పోషించింది. న్యాయస్థానం ఎదుట పక్కా సాక్ష్యాధారాలు సమర్పించి బాధితులకు సరైన న్యాయం జరిగేలా కృషి చేసింది. అంతే కాకుండా పోలీస్‌ అక్కా, షీటీంలతో విస్తృతంగా అవగాహన కల్పించి ఆకతాయిల ఆట కట్టిస్తుంది. – మెదక్‌జోన్‌

జిల్లావ్యాప్తంగా గడిచిన ఏడాదిన్నర కాలంలో 27 పోక్సో కేసుల్లో ఏకంగా 28 మంది నిందితులకు కఠిన కారాగార శిక్షలు పడ్డాయి. ఇందులో పోలీస్‌ల పాత్ర కీలకం. ఒకప్పుడు బాలికలపై అఘాయిత్యాలు జరిగితే మూడో కంటికి తెలియకుండా గ్రామ పెద్దలతో పంచాయితీ పెట్టి జరిమానాలు, చిన్నపాటి శిక్షలు వేసి వదిలేసేవారు. కానీ ఇటీవల పోక్సో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ బాలికలపై అఘాయిత్యాలు జరిగిన వెంటనే సాక్ష్యాధారాలను పకడ్బందీగా సేకరించి కోర్టు ఎదుట ఉంచుతున్నారు. ఫలితంగా బాధితులకు సరైన న్యాయం జరుగుతుంది.

విస్తృతంగా అవగాహన

బాలికలకు క్షేత్రస్థాయి నుంచే సరైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా ‘పోలీస్‌ అక్కా’ అనే కార్యక్రమాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా విద్యార్థినులకు గుడ్‌ టచ్‌, బ్యాడ్‌టచ్‌తో పాటు చట్టాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మహిళా కానిస్టేబుళ్లను ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌కు ఒకరి చొప్పున నియమించారు. ఆ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హైస్కూల్స్‌, ఇంటర్‌, డిగ్రీ కాలేజీలలో ప్రత్యేకంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్నారు. అసభ్యంగా తాకడం, మాట్లాడటం సైతం పోక్సో పరిధిలోకి వస్తుందని వివరిస్తున్నారు. ప్రేమ, స్నేహం ముసుగులో లైంగికంగా వేధించినా, దాడి చేసినా వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

2 నుంచి 20 ఏళ్ల వరకు

పోక్సో కేసులో గత ఏడాదిన్నర కాలంగా 27 కేసుల్లో 28 మంది నిందితులకు కేసు తీవ్రతను బట్టి 2 నుంచి 20 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్షలు పడ్డాయి. అంతే కాకుండా రూ. 10 వేల నుంచి రూ. 2 లక్షల వరకు జరిమానాను న్యాయస్థానం విధించింది. నిందితులకు శిక్ష పడేలా సాంకేతక ఆధారంగా పకడ్బందీ సాక్ష్యాధారాల సేకరణలో పోలీస్‌ సిబ్బంది వ్యవహరించిన తీరు హర్షనీయం. వీరికి జిల్లా పోలీస్‌బాస్‌ ప్రత్యేకంగా రివార్డులు, అవార్డులు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement