పాపన్నపేట(మెదక్): దేవి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఏడుపాయల వన దుర్గమ్మ శుక్రవారం సరస్వతీ దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారిని తెలుపు రంగు వస్త్రాలతో అలంకరించి వీణాధారిణిగా తీర్చిదిద్దారు. గోకుల్షెడ్లో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిన్నారులకు అర్చకులు అక్షరాభ్యాసం చేయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఈఓ వీరేశం ఏర్పాట్లు చేశారు.
ఎమ్మెల్యే సునీతారెడ్డి
నర్సాపూర్: రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సరిపడా కరెంటు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం అధికారంలో ఉందని ఎమ్మెల్యే సునీతారెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. పంటలు నష్టపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండు చేశారు. కరెంటు సరిపడా రానందున పంటలు ఎండిపోతున్నాయని విచారం వ్యక్తం చేశారు. రైతులు వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడులు వృథా అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో భద్రాది, యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసి అన్నివర్గాల ప్రజలకు సరిపడా కరెంట్ సరఫరా చేశారని గుర్తుచేశారు. ముందస్తు ప్రణాళిక లేనందున కరెంటు కొరత ఏర్పడిందన్నారు. సింగరేణిలో జరిగాయన్న ఆరో పణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
నర్సాపూర్: హోటళ్లు, రెస్టారెంట్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని మున్సిపల్ కమిషనర్ సాయికుమార్ అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని పలు హోటళ్లలో తనిఖీలు చేసి మాట్లాడారు. హోటళ్లలోని కిచెన్, స్టోర్ రూం, ఇతర గదులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. నాణ్యమైన పదార్థాలు వినియోగించి వంటలు చేయాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట మున్సిపల్ ఇన్చార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ మురళీమోహన్, వార్డు ఆఫీసర్లు ఉదయ్, ప్రవీణ్, నాగేంద్రబాబు తదితరులు ఉన్నారు. ఇదిలాఉండగా బస్టాండ్ ఎదురుగా ఉన్న సిటీ ప్యాలెస్లోని వంట గది, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో రూ. 2 వేల జరిమానా విధించి నోటీస్ అందచేశారు.
రామాయంపేట(మెదక్): పట్టణంలోని సన్ రిచ్ చిల్డ్రన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందిన కేసులో వైద్యాశాఖ అధికారులు శుక్రవారం విచారణ జరిపారు. డీఎంహెచ్ఓ ఆదేశాల మేరకు ప్రగతి ధర్మారం పీహెచ్సీ వైద్యురాలు హరిప్రియ ఆస్పత్రిలో విచారణ జరిపి, బాలిక చికిత్సకు సంబంధించిన ప్రిస్కిప్షన్, మందులను పరిశీలించారు. విచారణలో తేలిన అంశాలను డీఎంహెచ్కు నివేదించినట్లు తెలిపారు. ఆమె వెంట ఆస్పత్రి ఉద్యోగులు ఉన్నారు.


