● దివ్యాంగులు, వృద్ధులకు సాధికారత
● ఉచితంగా కృత్రిమ పరికరాల పంపిణీ
● జిల్లాలో 461 మంది ఎంపిక
ఇతరులపై ఆధారపడకుండా స్వశక్తి, ఆత్మగౌరవంతో జీవనం సాగించేందుకు కేంద్రం దివ్యాంగులు, వయో వృద్ధులకు భరోసా కల్పిస్తుంది. ఇప్పటికే జిల్లాలో 461 మందిని గుర్తించి రూ.76 లక్షల విలువ చేసే సహాయ పరికరాలు మంజూరు చేసి లబ్ధిదారులకు అందించింది.
– మెదక్‌జోన్
జిల్లాలో గతేడాది అలిమోక్ సంస్థ సహకారంతో కేంద్ర ప్రభుత్వం మూడు దివ్యాంగుల శిబిరాలను ఏర్పాటు చేసింది. వికలాంగులు, వయో వృద్ధులు స్వశక్తితో నడిచేందుకు అవసరమైన పరికరాలను వైద్యులు గుర్తించి ఎంపిక చేశారు. ఇందులో జిల్లావ్యాప్తంగా 461 మంది లబ్ధిదారులకు గుర్తించారు. వీరికి తక్షణం కావాల్సిన 23 రకాలు గల 850 పరికరాలను ఎంపిక చేశారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.76 లక్షలు ఖర్చు చేసి ఇటీవల మెదక్, రామాయంపేటలో లబ్ధిదారులకు పంపిణీ చేసింది. అంగవైకల్యం, శరీరం సహకరించని వయో వృద్ధులు ఇతరులపై ఆధారపడి జీవించడం భారంగా మారుతుంది. ధనికులైతే పరవాలేదు.. కానీ పేదలకు అలాంటి పరిస్థితి ఎదురైతే వారి బాధ వర్ణణాతీతం. అఅన్ని పనులు పక్కన పెట్టి వారికి సేవ చేయటమంటే ఆ కుటుంబం పస్తులుండాల్సిన పరిస్థితి. అలాంటి వారికి కేంద్రం ఏడీఐపీ పథకం ద్వారా పంపిణీ చేస్తున్న వీల్ చైర్లు, నడక కర్రలు, వినికిడి యంత్రాలు, కళ్లద్దాలు, ఇతర 23 రకాల పరికరాలను అందించటం ద్వారా వారు సంతోషకరమైన జీవనం సాగిస్తున్నారు.
గొప్ప ఊరట
కేంద్ర ప్రభుత్వం వికలాంగులకు, వృద్ధులకు పూర్తిగా ఉచితంగా పంపిణీ చేసే పరికరాల కోసం ఆయా మండలాలకు చెందిన లబ్ధిదారులు శిబి రాలకు సహాయకులతో వస్తున్నారు. వారికి కేటా యించిన పరికరాలు తీసుకొని ఎవరి సహాయం లేకుండా వెళ్లి పోతున్నారు. ఫలితంగా వారికి ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఇలాంటి పథకాలు నిస్సహాయులకు గొప్ప ఊరటనిస్తోంది.
నేడు నర్సాపూర్‌లో..
జిల్లావ్యాప్తంగా 3 క్యాంపులను ఏర్పాటు చేసి వైద్యుల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందులో మెదక్‌లో 136 మంది రామాయంపేటలో 202, నర్సాపూర్‌లో 123 మంది చొప్పున మొత్తం 461 మంది లబ్ధిదారులను గుర్తించారు. వారిలో ఇప్పటికే మెదక్, రామాయంపేటలో పరికరాలు పంపిణీ చేయగా, చివరగా శనివారం నర్సాపూర్‌లో పంపిణీ చేయనున్నారు.
ఈ పథకం గొప్పవరం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏడీఐపీ పథకం దివ్యాంగులకు, వయోవృద్ధులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో పూ ర్తి ఉచితంగా వారికి అవసరమైన 23 రకాల పరికరాలను పంపిణీ చేస్తున్నారు. వీల్చైర్లతో పాట వినికిడి, చేతికర్రలు, కృతిమ అవయవాలు అందజేస్తున్నాం.
– రఘునందన్‌రావు, ఎంపీ


