మహేశ్వరీ దీనగాథకు స్పందించిన అధికారులు
స్పందన
కౌడిపల్లి(నర్సాపూర్): ఇల్లు లేక గుడిసెలో ఉంటూ జీవితం గడుపుతున్న కుటుంబానికి ఎట్టకేలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. మండలంలోని వెల్మకన్నకు చెందిన కాయిత మహేశ్వరీ, శ్రీను దంపతులకు ఇద్దరు పిల్లలు. సొంత ఇల్లు లేక పోవడంతో టాపర్లతో వేసుకున్న గుడిసెలో ఉంటున్నారు. తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని మహేశ్వరీ దరఖాస్తు చేసుకోగా, మొదటి విడతలో మంజూరు కాలేదు. దీంతో గత మార్చిలో గ్రామానికి కలెక్టర్ ప్రతిమాసింగ్ రావడంతో ఇల్లు మంజూరు చేయాలని వేడుకుంది. ఆ సమయంలో బాధితురాలి బాధను పరిశీలించిన ‘సాక్షి’ ‘ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి’ అంటూ ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈక్రమంలోనే గ్రామానికి ఎమ్మెల్యే సునీతారెడ్డి రావడంతో సమస్యను వివరించి వేడుకుంది. దీంతో అధికారులు, నాయకులు ఎట్టకేలకు స్పందించి ఇల్లు మంజూరు చేశారు. శుక్రవారం పంచాయతీ సిబ్బంది, నాయకులు మహేశ్వరీ ఇంటికి ముగ్గు వేసి ఇంటి పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా ‘సాక్షి’కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ నవీన్‌గుప్త, సర్పంచ్ శివలీల, ఉప సర్పంచ్ ప్రభు, నాయకులు నాగభూషనం, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.


