ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు
తూప్రాన్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 4న మండలంలోని బ్రహ్మణపల్లిలో పర్యటించనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఏఎస్‌ఎల్ సమావేశం నిర్వహించారు. పర్యటనకు సంబంధించిన భద్రతా ప్రణాళిక, బందోబస్తు, రూట్, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, జిల్లా పోలీస్ అధికారులు, రెవెన్యూ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ, ఆర్‌అండ్‌బీ, ఐఎస్‌డబ్ల్యూ, సీఆర్‌పీఎఫ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కేంద్ర హోంమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. పర్యటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను ముందుగానే అంచనా వేసి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శాఖల మధ్య నిరంతర సమాచార మార్పిడి ఉండాలని, పర్యటనకు సంబంధించిన ప్రతి అంశంపై పరస్పర సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


