మెదక్ కలెక్టరేట్: జిల్లాలో టూరిజం అభివృద్ధి కోసం కలెక్టర్ ప్రతిమాసింగ్ చేస్తున్న విశేష కృషికి ఫలితం దక్కింది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం హైదరాబాద్ శిల్పారామంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతిష్టాత్మకమైన ఉత్తమ పర్యాటక ప్రతిభ అవార్డును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా కలెక్టర్ అందుకున్నారు. ఈసందర్భంగా రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సెక్రటరీ వాణిప్రసాద్ కలెక్టర్‌కు ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాలను గుర్తించి, వాటిని పర్యాటక హబ్‌లుగా తీర్చిదిద్దడంలో మెదక్ కలెక్టర్ తీసుకున్న చొరవను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడం వెనుక జిల్లా పర్యాటక శాఖ అధికారులు, సిబ్బంది మీడియా, ప్రజల సహకారం ఎంతో ఉందన్నారు. ఈ పురస్కారం తమపై బాధ్యతను మరింత పెంచిందన్నారు.


