ఇందిరమ్మ.. చీర ఏదమ్మా? | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ.. చీర ఏదమ్మా?

Sep 21 2026 7:23 AM | Updated on Sep 21 2026 7:23 AM

● మెదక్‌ బల్దియాలో పంపిణీకి నోచుకోని వైనం ● అయోమయంలో ఎస్‌హెచ్‌జీ మహిళలు ● పట్టించుకోని అధికారులు

● మెదక్‌ బల్దియాలో పంపిణీకి నోచుకోని వైనం ● అయోమయంలో ఎస్‌హెచ్‌జీ మహిళలు ● పట్టించుకోని అధికారులు

మెదక్‌ కలెక్టరేట్‌: స్వయం సహాయక (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు ప్రభుత్వం ఆరు నెలల క్రితం ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసింది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో మహిళలకు అందజేసినా, మెదక్‌ మున్సిపాలిటీలో మాత్రం ఇప్పటివరకు ఇవ్వలేదు. ఓవైపు దసరా సమీపిస్తుండటంతో ప్రభుత్వం మరోసారి చీరల పంపిణీకి సిద్ధమవుతోంది. ఇక్కడ మాత్రం ఇంకా చీరలు పంపిణీకి నోచుకోకపోవడం అన్యాయమని మహిళలు వాపోతున్నారు. మెప్మా సిబ్బంది ఎప్పటికప్పుడు కుంటి సాకులు చెబుతూ పంపిణీని వాయిదా వేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

జిల్లాలో 4 మున్సిపాలిటీలు

జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలుండగా, ప్రభుత్వం 30,665 చీరలను అందజేసింది. మెదక్‌కు 12,956, రామాయంపేట 4,587, తూప్రాన్‌ 7,149, నర్సాపూర్‌ 5,973 చొప్పున సరఫరా చేసింది. ఇందులో మూడు మున్సిపాలిటీలు నర్సాపూర్‌, రామాయంపేట, తూప్రాన్‌లో ఇప్పటికే చీరల పంపిణీ పూర్తయ్యింది. కానీ మెదక్‌ మున్సిపాలిటీలో మాత్రం ఇప్పటివరకు చీరలు పంపిణీకి నోచుకోలేదు. నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 75 వార్డులుండగా, 1,924 స్వయం సహాయక సంఘాలున్నాయి. ఇందులో 19,083 సభ్యులు, 74 ఎస్‌ఎల్‌ఎఫ్‌లు, 4 టీఎల్‌ఎఫ్‌లు ఉన్నాయి. అలాగే ఎస్‌ఎల్‌ఎఫ్‌ ఆర్పీలు 65, టీఎల్‌ఎఫ్‌ ఆర్పీలు 4 ఉన్నారు.

దసరాకు మరోసారి!

ప్రభుత్వం బతుకమ్మ పండుగ సమీపిస్తుండగా, ఈ ఏడాది మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అయితే మెదక్‌ మెప్మాలో మాత్రం ఆరు నెలల క్రితం ప్రభుత్వం ద్వారా వచ్చిన ఇందిరమ్మ చీరలు ఇంకా పంపిణీ చేయడం లేదు. అయినప్పటికీ అటు అధికారులు, ఇటు పాలకులు పట్టించుకున్న పాపానపోవడం లేదని పట్టణంలోని మహిళలు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో చీరలు పంపిణీ పూర్తయినా, పట్టణంలో మాత్రం ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై మెప్మా పీడీ హన్మంతరెడ్డిని వివరణ కోరగా.. మెదక్‌ మున్సిపాలిటీకి పరిధిలో ఉన్నట్లు తెలిపారు. ఈ విషయమై ఫోన్‌ ద్వారా వివరణ కోరేందుకు ప్రయత్నించగా కమిషనర్‌ నవీన్‌ అందుబాటులోకి రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement