మొరాయిస్తున్న భూ భారతి సైట్
మందగించిన భూముల రిజిస్ట్రేషన్లు
సర్వే ప్రక్రియను పర్యవేక్షిస్తున్న ఆర్డీఓ రమాదేవి
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల తహసీల్దార్ కార్యాలయంలో రోజుకు సగటున 20 నుంచి 25 వరకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. భూభారతి పోర్టల్‌లో సర్వర్ సమస్య కారణంగా పక్షం రోజులుగా ఏ రోజు కూడా మూడు, నాలు గుకు మించి రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. దీంతో పట్టాదారులు, రైతులు ఇలా పడిగాపులు కాస్తున్నారు.
మెదక్ జిల్లా నిజాంపేట్ మండల తహసీల్దార్ కార్యాలయంలో గత నెల 29 నుంచి ఇప్పటి వరకు సుమారు 85 వరకు రిజిస్ట్రేషన్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఈ ఒక్క చిన్న మండలంలోనే ఈ పరిస్థితి ఉంటే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 612 తహసీల్దార్ కార్యాలయాల్లో ఎన్ని వేల రిజిస్ట్రేషన్లకు తాత్కాలిక బ్రేక్ పడిందనేది అంచనా వేసుకోవచ్చు.
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి
భూభారతి పోర్టల్ సర్వర్ సమస్య కారణంగా రైతులు, పట్టాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పక్షం రోజులుగా రిజిస్ట్రేషన్లు సరిగ్గా జరగకపోవడంతో రైతులు తహసీల్దార్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సర్వర్ ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు తమ భూములు రిజిస్ట్రేషన్ జరుగుతుందా..అని ఎదురు చూస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసినా రోజుకు రెండు, మూడు రిజిస్ట్రేషన్లు కూడా జరగడం లేదు. దీంతో మిగతావారు రోజంతా వేచి చూసి నిరాశతో వెళ్లిపోతున్నారు. దాదాపు పక్షం రోజులుగా ఇదే సమస్య నెలకొంది.
మెయింటెనెన్స్ పేరుతో...
భూభారతి పోర్టల్‌ను యాన్యువల్ మెయింటెనెన్స్ చేస్తున్నారని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. మొదట జూన్ 26 నుంచి 29 వరకు రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్లు రెవెన్యూశాఖ అధికారికంగా ప్రకటించింది. కానీ 12 రోజులవుతున్నా..ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడేషన్ జరుగుతోందని, సర్వర్ సామర్థ్యం కూడా పెంచుతున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక..రానున్న రోజుల్లో పోర్టల్ మరింత వేగంగా పనిచేస్తుందని చెప్పుకొస్తున్నారు.
ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సమస్య లేదు
భూభారతిలో పోర్టల్‌లో ట్రాన్సక్షనల్ సర్వీస్ మాత్రమే సమస్య కొనసాగుతోంది. సాధారణ ప్రజలు సెర్చ్ చేసే సమాచార సేవలకు మాత్రం ఎ లాంటి సమస్య రావడం లేదు. మార్కెట్ వ్యాల్యూ, భూమి వివరాలు, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలు, ఈసీ వివరాలు (ధరణికి ముందు), రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వివరాలు వంటి సేవలుకు పెద్దగా ఇబ్బంది కావడం లేదు. కేవలం భూలావాదేవీలకు సంబంధించిన లాగిన్‌లోనే సమస్య కొనసాగుతోంది.
రిజిస్ట్రేషన్లు జరగక తహసీల్దార్ కార్యాలయాల్లో రైతుల పడిగాపులు
పక్షం రోజులుగా కొనసాగుతున్న పట్టాదారుల కష్టాలు
పోర్టల్ యాన్యువల్ మెయింటెనెన్స్ అంటున్న అధికారులు


