పోలీస్‌ అక్క.. భద్రత పక్కా | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ అక్క.. భద్రత పక్కా

Jul 12 2026 6:52 AM | Updated on Jul 12 2026 6:52 AM

మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 7.24 లక్షల మంది జనాభా ఉండగా వారిలో పురుషులతో పోల్చుకుంటే మహిళా జనాభా ఎక్కువగా ఉంది. తోటి విద్యార్థులతో పాటు తెలిసినవారు, దగ్గరి బంధువులు, ప్రేమ పేరుతో ఇబ్బందులు పెట్టడం, లైంగిక వేధింపుల నేపథ్యంలో బాధిత బాలికలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావటం లేదు. సమాజంలో తెలిస్తే తమ పరువు పోతుందనే భావన, లేదా తల్లిదండ్రులకు తెలిస్తే చదువులు మాన్పిస్తారనే భయంతో చెప్పడానికి సుముఖంగా లేరనే వాదన వినిపిస్తోంది. ఇలాంటి వారి కోసం జిల్లా రక్షణశాఖ ‘పోలీస్‌ అక్క’ అనే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు.

ముందుగా విద్యాసంస్థల్లో..

ముందుగా విద్యార్థినులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ నెల 9న, జిల్లా కేంద్రంలోని మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో పోలీస్‌ అక్క గురించి వివరించారు. అలాగే జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లకు ఒక మహిళా కానిస్టేబుల్‌ను నియమించారు. బాలికల పాఠశాలలు, కళాశాలలు, కేజీబీవీలు తదితర వాటిలో అవగాహన కల్పించటంతో పాటు ప్రతి బాలిక వద్ద ‘పోలీస్‌ అక్క’ ఫోన్‌ నంబర్‌ ఉండాలని సూచించారు. ఏ సమస్య వచ్చినా నేరుగా చెప్పుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎస్పీ వివరించారు.

ఆకతాయిల ఆట కట్టిస్తారు..

‘పోలీస్‌ అక్క’ రంగ ప్రవేశంతో ఇక ఆకతాయిల ఆట కట్టించడమే తరువాయి. మహిళల భద్రతకు ఇప్పటికే షీటీం, బాలికల కోసం భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ ఆశించిన మేర ఫలితాలు రాలేదని తెలుస్తోంది. పోలీస్‌ అక్కతో ప్రతీ బాలిక ఎలాంటి సమస్య ఎదురైనా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లకుండానే ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అనంతరం ఆకతాయిల ఆట కట్టిస్తారు. దీంతో బాలికలకు సంపూర్ణ భద్రతతో వారి ఉన్నత చదువులకు, కెరీర్‌కు ఎలాంటి ఆటంకం కలుగకుండా అండగా నిలవనుంది.

చదువుకునే చోట పాఠశాలలు, కళాశాలలతో పాటు వచ్చి పోయే దారిలో తోటి విద్యార్థులు ర్యాగింగ్‌ పేరుతో విద్యార్థినులను(బాలికలను) ఇబ్బందులు పెట్టడం, ప్రేమపేరుతో మోసం చేయటం ఎక్కడో ఒకచోట నిత్యకృత్యంగా మారింది. ఇక నుంచి అలాంటి ఆకతాయిలు చేసే వికృత చేష్టలకు కాలం చెల్లినట్టే. విద్యార్థినుల భద్రతే లక్ష్యంగా ‘పోలీస్‌ అక్క’ పేరుతో ప్రతీ పోలీస్‌ స్టేషన్‌కు ఒక మహిళా కానిస్టేబుల్‌ను నియమించింది.

– మెదక్‌ జోన్‌

పోలీస్‌ స్టేషన్‌కు ఒక మహిళా కానిస్టేబుల్‌ కేటాయింపు

విద్యార్థినులు తమ సమస్యలు చెప్పేలా ప్రోత్సాహం

మహిళా చట్టాలపై విస్తృత అవగాహన

నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన పోలీస్‌శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement