మెదక్ ఆర్‌డీఓ రమాదేవి
చిన్నశంకరంపేట(మెదక్): ఎస్‌ఐఆర్ ఓటరు సమగ్ర సర్వే డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని మెదక్ ఆర్‌డీఓ రమాదేవి అధికారులకు స్పష్టం చేశారు. చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ తండాలో శనివారం ఎస్‌ఐఆర్ పక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఇంటింటికీ అందించిన ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి తీసుకుని ఓటర్ల వివరాలను ఆన్‌లైన్ చేయాలని కోరారు. ఎవరైనా ఫారం నింపలేని పరిస్థితి ఉంటే గ్రామ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్, వీఆర్‌ఏల సహకారంతో ఓటరు ఫారం నింపేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పట్ల నిర్లక్ష్యం చూపవద్దని, అవసరమైతే పనిగంటలను పెంచుకుని కార్యక్రమం పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆమె వెంట తహసీల్దార్ మాలతి, సర్పంచ్ ప్రియానాయక్ ఉన్నారు.
మాధవానంద సరస్వతి స్వామి
పాపన్నపేట (మెదక్): సమాజంలో మానవత్వాన్ని మించినది ఏదీ లేదని రంగంపేట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి అన్నారు. శనివారం ఆయన మండల పరిధిలోని నాగ్సాన్‌పల్లి ఉమా కేదారీశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ మేరకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో భక్తులతో మాట్లాడారు. నిరంతరం భగవంతుడి నామస్మరణ చేయడంతోనే మనిషికి నిజమైన మనఃశాంతి లభిస్తుందని చెప్పారు. మానవ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు ఆ దేవుడే తగిన పరిష్కారం చూపుతాడని భక్తులకు ప్రబోధించారు. ఈ సందర్భంగా ఇంద్రసేనా రెడ్డి దంపతులు స్వామి వారికి అత్యంత భక్తిశ్రద్ధలతో పాదపూజ నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రాజశేఖర్ శర్మ, శ్యాంసుందర్ శర్మ, రామవర్మ, శ్రావిత్ శర్మలతో పాటు పార్శి నర్సింలు, యాబన్న, మోహన్ రెడ్డి, ఎర్రం రవీందర్, సాయిబాబ, మహేందర్, శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు.


