యూనిఫారం.. ఆమడ దూరం
● బడులు తెరిచినా.. అందని దుస్తులు
● ఎదురుచూస్తున్న విద్యార్థులు
● పాత దుస్తులతోనే స్కూళ్లకు చిన్నారులు
మెదక్‌కలెక్టరేట్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ప్రతియేటా పాఠ్య పుస్తకాలు, నోటు బుక్స్‌తోపాటు యూనిఫారాలు అందజేస్తుంది. పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం కూడా అందిస్తోంది. పాఠశాలల పునః ప్రారంభం నాటికి అన్ని తరగతుల విద్యార్థులకు రెండు జతల యూనిఫారాలు అందజేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం యూనిఫారాల పంపిణీ కానరాలేదు.
చేరని వస్త్రం
జిల్లాలోని ఎంపీపీ, జెడ్పీహెచ్‌ఎస్, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న మొత్తం 64,935 మంది విద్యార్థులకు కొత్త రకం యూనిఫారాలు అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న యూనిఫారాల రంగుల్లో మార్పులు చేసి కొత్త డిజైన్లను ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోను ఈ యూనిఫారం విధానం అమలు చేయనున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ యూనిఫారాలకు సంబంధించిన వస్త్రం జిల్లాకు చేరలేదు.
అందని యూనిఫారాలు
విద్యా సంవత్సరం ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంకా యూనిఫారాలు అందలేదు. గతంలో విద్యా సంవత్సరానికి ముందే పాఠశాలలకు చేరుకునేవి. దీంతో విద్యార్థులంతా యూనిఫారాలు ధరించి స్కూళ్లకు హాజరయ్యేవారు. ఈ ఏడాది ప్రభుత్వం కొత్తరకం యూనిఫారం అందిస్తామని ప్రకటించడంతో విద్యార్థులు మురిసిపోయారు. కానీ ఇప్పటికీ అందకపోవడంతో నిరాశగా ఎదురుచూస్తున్నారు. కనీసం వస్త్రం కూడా చేరుకోకపోవడంతో యూనిఫారాలు ఇస్తారా? మర్చిపోయారా? అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి యూనిఫారాలు అందజేయాలని విద్యార్థులు, వారి తలిదండ్రులు కోరుతున్నారు. జిల్లా విద్యాశాఖలోని యూనిఫారాల నిర్వహణ అధికారి రాజును వివరణ కోరగా వస్త్రం ఇంకా చేరుకోలేదని చెప్పారు. వస్త్రం రాగానే వెంటనే స్టిచ్చింగ్ ప్రారంభిస్తామని తెలిపారు.
సంక్షేమ గురుకులాలకే..
జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీ, యూఆర్‌ఎస్, టీఆర్‌ఈఐఎస్, టీడబ్య్లూ, ఎంజేపీటీబీలలో విద్యార్థులకు మాత్రం యూనిఫారాలు త్వరలోనే అందనున్నాయి. వాటిలో ప్రస్తుతం 15,753 మంది విద్యార్థులు ఉండగా వారందరికీ గతంలో ఉన్న మాదిరిగానే యూనిఫారాలు అందజేయనున్నారు. యూనిఫారాలకు సంబంధించిన వస్త్రం రావడంతో స్టిచ్చింగ్ ప్రారంభమైంది.


