సూరారం గ్రామసభలో మహిళల నిలదీత
చిన్నశంకరంపేట(మెదక్): అర్హులైనప్పటికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంలేదని, ఇదేమని అడిగితే తమకు ఓటు వేశారా అంటు కొందరు నాయకులు అంటున్నారని చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామసభలో మహిళలు భగ్గుమన్నారు. సోమవారం సూరారం సర్పంచ్ నాగరాజు అధ్యక్షతన గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఇదే సమయంలో గ్రామానికి చెందిన పలువురు మహిళలు తాము ఇళ్లులేక అద్దె ఇంట్లో ఉంటున్నామని కొందరు, శిథిలమైన పాత ఇళ్లలో బిక్కుబిక్కుమంటున్నా కనికరించడంలేదని మరి కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన తమకెప్పుడు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తారని మండిపడ్డారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగరాజు మాట్లాడుతూ..అర్హులైన ప్రతి ఒక్కరికి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో చేర్చుతామని సర్దిచెప్పారు. ఎస్సీ కాలనిలో నీటి సమస్య ఉందని కొందరు సభ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఎంపీఓ వినోద్, గ్రామ కార్యదర్శి నాంపల్లి, ఉపసర్పంచ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
నిజాంపేట(మెదక్): నిజాంపేట పరిధిలోని తిప్పన్నగుల్ల గ్రామంలో సోమవారం ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు తడి, పొడి, హానికర, శానిటరీ చెత్తను వేర్వేరుగా ఎలా విభజించాలో అధికారులు ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. వీటితో పాటు ఎస్‌ఐఆర్, వర్షాకాల సన్నద్ధత, ఉపాధి హామీ పథకం వంటి పలు కీలక అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో సర్పంచ్ మంగలిపల్లి మంజుల తదితరులు పాల్గొన్నారు.
50 సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తాం
టేక్మాల్(మెదక్): ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు దాదాయిపల్లి సర్పంచ్ నరసింహరావు దేశ్‌పాండే అన్నారు. సోమవారం మండలంలోని దాదాయపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన గ్రామసభలో పలు అభివృద్ధి పనులపై తీర్మానాలు చేశారు. తాగునీటి వ్యవస్థ, మురుగు కాల్వల నిర్మాణం, పారిశుద్ధ్య కార్యక్రమాలు వంటి పలు అంశాలపై సభలో చర్చించారు. గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించేందుకు దాదాయపల్లి, మల్కాపూర్ గ్రామాలకు కలిపి 50 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. కార్యక్రమంలో టేక్మాల్ ఎస్సై అరవింద్ కుమార్, పంచాయతీ కార్యదర్శి పరమేశ్వరి, ఏపీఎం గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
పరిశుభ్రత పాటించాలి
రేగోడ్(మెదక్): ప్రతీఒక్కరూ పరిశుభ్రత పాటించాలని సర్పంచ్ పర్వీన్ సుల్తాన ప్రజలను కోరారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు దూరంగా ఉంటాయని సూచించారు. గ్రామాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ పోచయ్య, ఉప సర్పంచ్ ధనలక్ష్మి, కో ఆప్షన్ మాజీ సభ్యుడు చోటుమియా, మాజీ ఎంపీటీసీ నరేందర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.
తడి, పొడి చెత్తపై అవగాహన
చిలప్‌చెడ్(నర్సాపూర్): గ్రామాలలో వందశాతం పారిశుద్ధ్యం సాధించే విధంగా, గ్రామ ప్రజలకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించామని ఎంఈఓ మునీరుద్దీన్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని చండూర్ గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా సర్పంచ్ శేషాద్రి అధ్యక్షతన ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. ఏఈఓ వంశీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో నాలుగు రకాల చెత్త బుట్టలను వినియోగించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తిరుపతి, పంచాయతీ పాలకవర్గ సభ్యు లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
తూప్రాన్‌లో...
తూప్రాన్: వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సి పల్ కౌన్సిలర్ జైపాల్ రాథోడ్ అన్నారు. వర్షాకాలం సీజన్‌లో వ్యాధుల పట్ల ప్రజలు ముందు జాగ్రత్త తీసుకోవాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అలాగే ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరికి అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ బడుల్లోనే పిల్లలను చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ మహేష్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ ప్రత్యూష, వర్క్ ఇన్‌స్పెక్టర్ వేదాంత, అంగన్వాడీ టీచర్ పద్మ, తదితరులు పాల్గొన్నారు.


