పెద్దశంకరంపేట(మెదక్): మండలంలో మృగశిర కార్తె సందడి నెలకొంది. సోమవారం మండల కేంద్రంలోని చేపల మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా కొరమీను కిలో ధర రూ.650, ఇతర బొచ్చ, రౌట తదితర చేపలు రూ.200లకు విక్రయించారు. పండుగ సందర్భంగా గ్రామాలలో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్తెలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని రైతులు దేవుడిని వేడుకున్నారు.
చేపలకు డిమాండ్
చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో చేపలకు డిమాండ్ పెరిగింది. మార్కెట్‌లో నిత్యం రూ.100 పలికే తెల్లచేపలు రూ.200 వరకు పలికాయి, చెరువుల వద్ద రూ.150 వరకు ఇచ్చారు. ఇక కొర్రమీను చేపల కోసం డిమాండ్ ఉన్నప్పటికి స్థానికంగా కొర్రమీను చేపలు కన్పించలేదని స్థానికులు చెప్పారు.
జోరుగా చేపల విక్రయాలు
చిలప్‌చెడ్(నర్సాపూర్): మండల పరిధిలోని ఆయా గ్రామాలలో మృగశిర కార్తె పురస్కరించుకుని సోమ వారం జోరుగా చేపల విక్రయాలు కొనసాగాయి. మాములు రోజులలో రౌట, బంగారుతీగ, బొచ్చె, గ్యాస్‌కట్ లాంటి చేపలు కిలోకు రూ.120 నుండి 150 వరకు ఉండగా, మృగశిర రోజు మాత్రం రూ.180 నుంచి 250 వరకు, కొర్రమీను కిలోకు రూ. 300 నుండి 350 వరకు ఉండగా, రూ.500 వరకు ధరలు పెంచిన అమ్మకాలు బాగానే జరిగాయని మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు.
పాపన్నపేటలో...
పాపన్నపేట(మెదక్)/కౌడిపల్లి(నర్సాపూర్): మృగశిర కార్తెను పురస్కరించుకొని కొర్రమీను ధఽర కొండెక్కింది. మామూలు చేపల ధరలు సైతం అమాంతంగా పెరిగాయి. సాధారణ రోజుల్లో రూ.350 పలికే కొర్ర మీను రూ.450 వరకు విక్రయించారు. అలాగే రొహుట, బొచ్చ, గ్యాస్‌కట్ తదితర తెల్ల రకం చేపలు రూ.125 నుంచి రూ.250 వరకు అమ్మారు. పాపన్నపేట, నార్సింగి, పొడిచన్‌పల్లి తదితర గ్రామాల్లో చేపల వ్యాపారం జోరుగా సాగింది. అలాగే.. కౌడిపల్లి మండలంలో కూడా కొర్ర మీనురూ 600 నుంచి రూ 800 కిలో కాగా, తెల్లచేపలు రౌట, బొచ్చ, బంగారుతీగ రూ 200 నుంచి రూ 300 కిలో విక్రయించారు.


