సర్కారు బడుల్లోనే చేర్పించండి | - | Sakshi
Sakshi News home page

సర్కారు బడుల్లోనే చేర్పించండి

Jun 9 2026 8:34 AM | Updated on Jun 9 2026 8:34 AM

పీఎంశ్రీ పాఠశాల ఉపాధ్యాయుల బడిబాట

వెల్దుర్తి(తూప్రాన్‌): మండల కేంద్రం వెల్దుర్తిలోని పలు కాలనీల్లో సోమవారం పీఎంశ్రీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ప్రైవేట్‌ పాఠశాలకు వెళ్తున్న 9 మంది విద్యార్థులను గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న వసతులు, విద్యాబోధనపై రూపొందించిన కరపత్రాలను తల్లిదండ్రులకు అందజేసి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోకే పంపాలని కోరారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, నాణ్యమైన బోధన, విశాలమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, క్రీడా సౌకర్యాలతో పాటు విద్యార్థుల ప్రతిభను వెలికితీసే అనేక కార్యక్రమాలు ప్రతియేటా చేపడుతున్నట్లు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు అర్చన, జయసుధ, శైలజ, రేణుకాదేవి తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న బడిబాట

పెద్దశంకరంపేట(మెదక్‌): మండలంలో బడిబాట కార్యక్రమం కొనసాగుతోంది. సోమవారం స్థానిక పీఎంశ్రీ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఆయా గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం విద్యార్థులకు డిజిటల్‌ విద్య, ఉచిత పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలను కల్పిస్తుందని, ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు వినియోగించుకోవాలని ఉపాధ్యాయులు సిద్దిరాములు, నాగవేణి తదితరులు సూచించారు.

బడీడు పిల్లను బడిలో చేర్పించాలి

చిన్నశంకరంపేట(మెదక్‌): బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని కోరుతూ ఇంటింటి తిరిగి ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పిస్తున్నట్లు చిన్నశంకరంపేట ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తమ పాఠశాలలో 200 మంది విద్యార్థులను చేర్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పా రు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు స్కూల్‌ డ్రెస్‌తో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ అందించనున్నట్లు వివరించారు. ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్లి వృథా ఖర్చు చేయకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.

‘ఉపాధి’పని ప్రదేశం వద్ద ప్రచారం

అల్లాదుర్గం(మెదక్‌): ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధన, సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని, తమ పాఠశాలలో చేర్పిస్తే మంచి భవిష్యత్‌ ఉంటుందని ఉపాధ్యాయులు బడిబాటలో అవగాహన కల్పిస్తున్నారు. సోమవారం అల్లాదుర్గం బాలికల జెడ్పీ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు రాంపూర్‌ గ్రామంలో బడిబాట నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధి పనులకు వెళ్లడంతో, ఉపాధ్యాయులు, సర్పంచ్‌ గోపాల్‌రెడ్డితో కలిసి పని ప్రదేశం వద్దకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కొరారు. పాఠశాలలో చేర్పిస్తే పైసా కట్టనవసరం లేదని, డ్రెస్సులు, పుస్తకాలు, ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం, కంప్యూటర్‌ విద్య ఇలా ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement