బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

బాధ్యతల స్వీకరణ

Jun 8 2026 9:35 AM | Updated on Jun 8 2026 9:35 AM

నర్సాపూర్‌: నర్సాపూర్‌ సీఐగా రంగకృష్ణ ఆదివారం బాధ్యతలు తీసుకున్నారు. నర్సాపూర్‌ సీఐగా పని చేసిన జాన్‌రెడ్డి సిద్దిపేట జిల్లాకు బదిలీ కావడంతో అక్కడి నుంచి రంగ కృష్ణ నర్సాపూర్‌కు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సహకారంతో శాంతిభద్రతలను కాపాడడానికి కృషి చేస్తానని తెలిపారు. మత్తు పదార్థాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

బోరు మోటారు ప్రారంభం

నర్సాపూర్‌: పట్టణంలోని 14వ వార్డులో ఏర్పాటు చేసిన బోరు మోటారును ఆదివారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి, వైస్‌ చైర్మన్‌ బుచ్చేశ్‌ యాదవ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ జనరల్‌ ఫండ్స్‌తో బోరు మోటారు ఏర్పాటు చేశామన్నారు. దీంతో కాలనీవాసుల నీటి సమస్య తీరుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఫ్యాక్స్‌ చైర్మన్‌ రాజుయాదవ్‌, కౌన్సిలర్లు శ్రీకాంత్‌, సుధీర్‌గౌడ్‌, నీరంజన్‌దాస్‌, కాలనీవాసులు ఆంజనేయులుగౌడ్‌, రాఘవులుగుప్తా, పాండుసేట్‌, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

చాముండేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): చాముండేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆలయ అర్చకులు తెలిపారు. ఆదివారం మండలంలోని చిట్కుల్‌ శివారులో మంజీరా తీరాన వెలసిన చాముండేశ్వరి అమ్మవారికి ప్రీతికరమైన కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి ప్రదక్షిణలు చేసి, ఒడిబియ్యంతో మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు అర్చకులు తీర్థ, ప్రసాదాలు వితరణ చేశారు.

నల్లపోచమ్మదేవీ.. కరుణించుతల్లీ..

కౌడిపల్లి(నర్సాపూర్‌): మండలంలోని తునికి నల్లపోచమ్మ తల్లి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. దేవాదాయశాఖ ఉమ్మడి మెదక్‌ జిల్లా ఇన్‌స్పెక్టర్‌, ఆలయ ఇన్‌చార్జి ఈఓ రంగారావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు శివ్వప్ప, రాజేశ్‌ అమ్మవారికి పంచామృతంతో అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు అమ్మవారికి తలనీలాలు సమర్పించి వాహనాలకు పూజలు చేయించారు. ఆలయ జూనియర్‌ అసిస్టెంట్‌ వెంకట్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.

కార్యదర్శికి సన్మానం

రామాయంపేట(మెదక్‌): గ్రామాభివృద్ధిలో ప్రగతి ధర్మారం కార్యదర్శి మహేందర్‌ ఎనలేని కృషి చేసి అందరి మన్ననలు పొందారు. ఇటీవల ఆయన బదిలీ కాగా ఆదివారం ఆయనను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈమేరకు పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులతోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

మేవా నూతన కార్యవర్గం ఎన్నిక

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): ముస్లిం ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌(మేవా) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారులు షాజీద్‌, బాసిత్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఈ ఎన్నికలో గౌరవ అధ్యక్షుడిగా సయ్యద్‌ షౌకత్‌అలీ, అధ్యక్షుడిగా ఫకృద్దీన్‌, ఉపాధ్యక్షుడిగా గౌస్‌, సయ్యద్‌ ఎంపికయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement