తూప్రాన్: ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల ఊదాసీనత పేద విద్యార్థులకు శాపంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కాగితాలకే పరిమితమవుతోంది. మరో వారం రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు. మన ఊరు– మన బడి అటకెక్కింది. పాఠశాలల్లో డైనింగ్ హాళ్ల నిర్మాణాలు సగంలోనే నిలిచిపోయాయి. నిధులు రాక.. పనులు ముందుకు సాగడం లేదు.
జిల్లాలో 142 ప్రభుత్వ పాఠశాలలు
పాఠశాలల్లో భోజనశాలల నిర్మాణ పనులు అసంపూర్తి దశలో నిలిచిపోయాయి. మన ఊరు–మన బడి పథకం కింద జిల్లాలో 142 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 85 ఉన్నత పాఠశాలలకు డైనింగ్ హాల్స్ మంజూరయ్యాయి. వీటిలో 18 పాఠశాలల్లో మాత్రమే పూర్తి కాగా, మిగితా పాఠశాలల్లో పునాది, బెస్‌మెంట్, గోడల లేవల్‌లో ఉన్నాయి. డైనింగ్ హాల్స్ నిర్మాణానికి 2022–23 విద్యా సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది. ఒక్కో పాఠశాలలో మన ఊరు–మనబడి పథకం కింద ఒక్కో పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు కేటాయిపులు చేశారు. కానీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనులు నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ పేరుతో పథకం తీసుకొచ్చింది. ఈ పథకంలో మన ఊరు–మనబడి కింది నియామకం అయిన పాఠశాలలను పక్కన పెట్టి ఇతర పాఠశాలలను ఎంపిక చేశారు. కానీ పాఠశాలల్లో అసంపూర్తిగా ఉన్న డైనింగ్ హాల్స్‌ను మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు, నాయకులు స్పందించి పాఠశాలల్లో అసంపూర్తిగా ఉన్న డైనింగ్ హాల్స్‌ను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
నిధుల కొరతతోనే..
ప్రభుత్వ పాఠశాల్లో మన ఊరు– మనబడి పథకం ద్వారా చేపట్టిన డైనింగ్ హాల్స్ నిర్మాణ పనులు నిధుల కొరతతో నిలిచిపోయాయి. ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేస్తే అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడానికి చర్యలు చేపడుతాం. ఈ విషయం ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
– సత్యనారాయణ, ఎంఈఓ, తూప్రాన్
‘మన ఊరు– మనబడి’కి మంగళం
ఎక్కడికక్కడ నిలిచిన పనులు
విద్యార్థులకు తప్పని ఇబ్బందులు


