ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
రామాయంపేట(మెదక్): రామాయంపేట మండలానికి రెండు వందల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రకటించారు. బుధవారం మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలను మోసగించడానికి హడావిడిగా ఆర్డీఓ కార్యాలయాన్ని ప్రారంభించిందని ఆరోపించారు. ఈవిషయం సీఎం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో అధికారికంగా కార్యాలయాన్ని మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రికి డయాలసిస్ సెంటర్‌తో పాటు ట్రామా కేర్ సెంటర్ మంజూరు చేయిస్తానన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రతి వార్డులో సీసీ కెమరాలు ఏర్పాటు చేయిస్తామని, వైకుంఠధామం మరమ్మతులకు రూ. 30 లక్షలు మంజూరు చేస్తానన్నారు. మున్సిపాలిటీ పరిధిలో నీటి ఎద్దడి సమస్య పరిష్కరిస్తానన్నారు. గత ప్రభుత్వంలో మిషన్ భగీరధ, కాళేశ్వరం పేరిట రూ. వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎలాంటి అవినీతికి తావివ్వొద్దని పాలకవర్గానికి సూచించారు. పార్టీలకతీతంగా రామాయంపేటను అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే మహంకాళి ఆలయంలో పూజలు నిర్వహించి యాదాద్రి పార్కులో మొక్కలు నాటారు. మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ నవనీత, కమిషనర్ శ్రావణ్, మేనేజర్ రఘువరన్, కౌన్సిలర్లు, నాగరాజు, రంజిత్, సందీప్, రవినాయక్, ప్రవీణ్, స్వప్న, చరిత, శ్యామల, మాధవి, శంకర్‌గౌడ్ పాల్గొన్నారు.
పెండింగ్ బిల్లులు ఇవ్వండి
నర్సాపూర్: గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయాలని కోరుతూ మాజీ బుధవారం ఎమ్మెల్యే హన్మంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ మంత్రి సీతక్కను కలిశారు. జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాక సర్పంచ్‌లు ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. పార్టీలకతీతంగా పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని కోరినట్లు వారు చెప్పారు. కాగా జిల్లాలో అసంపూర్తిగా ఉన్న పంచాయతీ భవనాలు, రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. మే నెలాఖరురు పెండింగ్ బిల్లులు చెల్లించడంతో పాటు ఆయా పనులకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు
కౌడిపల్లి(నర్సాపూర్): పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని డీఈఓ విజయ తెలిపారు. బుధవారం కౌడిపల్లిలో పదో తరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. డెస్కులు, విద్యుత్, వెలుతురు, ఫ్యాన్లు, తాగునీరు తదితర సౌకర్యాలను పరిశీలించారు. కేంద్రం చుట్టుపక్కల ఎలాంటి చిత్తు కాగితాలు, పేపర్లు ఉండకుండా శుభ్రం చేయాలని సిబ్బందికి సూచించారు. ఓ గదిలో నేలపై బండలు సరిగా లేకపోవడంతో ఫ్లోరింగ్ చేయాలని ఆదేశించారు. కాగా తనిఖీ సమయంలో ఉన్నత పా ఠశాలలో హెచ్‌ఎం లలితాదేవి లేకపోవడంతో ఉపాధ్యాయులను ప్రశ్నించారు. కాగా ప్రతిరోజు హెచ్‌ఎం ఆలస్యంగా వస్తారని గ్రామస్తులు డీఈఓ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం బాలికల ఉన్నత పాఠశాలలో వార్డు సభ్యురాలు, వంటమనిషి బొంతమ్మ పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు ఇవ్వగా డీఈఓ అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు సాజిద్‌అలి, ఓంప్రకాష్, పీడీ విజయ్‌కృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
డీఈఓ విజయ


