మరో రెండు పంట విరామాలు! | - | Sakshi
Sakshi News home page

మరో రెండు పంట విరామాలు!

Mar 12 2026 9:08 AM | Updated on Mar 12 2026 9:08 AM

పుల్‌కల్‌(అందోల్‌): సింగూరు మరమ్మతు పనులు ఈ జూన్‌ నాటికి పూర్తికావడం కష్టమేనని తెలుస్తోంది. రివిట్‌మెంట్‌ పనులు జూన్‌ నాటికి కూడా పూర్తి కావని ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో మరో రెండు పంటలకు విరామం ప్రకటించాల్సి వస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. సింగూరు మరమ్మతులను నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ బృందం బుధవారం పర్యటించి పర్యవేక్షించింది. ఈ బృందం డ్యామ్‌ పటిష్టతపై నివేదిక ఇవ్వనుంది. గతేడాది ఈ బృందం డ్యామ్‌ లోపలి భాగంలో రాతికట్ట(రివిట్‌మెంట్‌) నీటి తొలుకులకు కుంగిందని నివేదిక సమర్పించింది. వెంటనే మరమ్మతులు చేయాలని సూచించింది. దీంతో ప్రభుత్వం రూ.16 కోట్లను మంజూరు చేసింది. ఈ రివిట్‌మెంట్‌ పనులను జరిపించేందుకు కమిటీ సూచనల మేర స్థానికంగా పంట విరామం ప్రకటించింది. డ్యామ్‌లో మిషన్‌ భగీరథకోసం 8 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి మిగతా నీటిని దిగువకు వదిలారు. మొదట 800 మీటర్లు కుంగిందని నివేదికలో పేర్కొన్నారు. డ్యామ్‌ పటిష్టతకోసం లోపలిభాగంలో మొత్తం 8 కిలోమీటర్ల మేర రాతికట్టను నిర్మించాలని సూచించారు. ప్రస్తుతం కేటాయించిన రూ.16 కోట్లకు అదనంగా నిధులు అవసరమవుతాయని ఇంజినీర్ల బృందం సూచించింది. ఎన్‌డీఎస్‌ఏ బృందం డ్యామ్‌ను పటిష్టతను అంచనా వేశారు. డ్యామ్‌ మరమ్మతు పనులను పర్యవేక్షించిన బృందంలో కమిటీ చైర్మన్‌ విజయ్‌ ట్రింబక్‌ దేశాయ్‌ సారధ్యంలో మురళీధర్‌, సతీశ్‌కుమార్‌ రేగొండ, శ్రీకాంత్‌, రాజు, లక్ష్మణరావు ఉన్నారు.

ఈ సీజన్‌లో పూర్తి కానట్లే...

డ్యామ్‌ రివిట్‌మెంట్‌ పనులు జూన్‌లోగా పూర్తి చేసి వానాకాలం పంటకు సాగునీరు ఇవ్వాలని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర నీటిపారుదల శాఖ అధికారులకు సూచించిన సంగతి తెలిసిందే. డ్యామ్‌లో మరో 8 టీఎంసీల నీరు ఉందని ఆనీటిని తాగునీటికి వదులుతూ నీరు తగ్గిన కొద్దీ పనులు జరిపించాలని ఇంజినీర్లు చెబుతున్నారు. దీంతో మరో రెండు పంటల వరకు క్రాఫ్‌ హాలీడే ప్రకటించాల్సి రావచ్చని తెలిపారు. ఈ బృందం వెంట నీటిపారుదల శాఖ రాష్ట్రస్థాయి అధికారులున్నారు.

జూన్‌లోగా సింగూరు రివిట్‌మెంట్‌ పనులు పూర్తికావడం కష్టమే

డ్యామ్‌ పనుల పరిశీలన.. పటిష్టతపై నివేదిక

ప్రాజెక్టును సందర్శించిన ఎన్‌డీఎస్‌ఏ బృందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement