పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు
మెదక్ అర్బన్: పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 14వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 11,247 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, 68 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి కొత్తగా హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. దానిపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. దాన్ని స్కాన్ చేస్తే.. పరీక్ష కేంద్రం రూట్ మ్యాప్ కనిపిస్తుంది. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షల కోసం విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని డీఈఓ విజయ సూచించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ముగ్గురు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, ఐదుగురు రూట్ ఆఫీసర్లు, 16 కస్టోడియన్‌లు, 17 సిట్టింగ్ స్క్వాడ్‌లు, 563 ఇన్విజిలేటర్లను నియమించారు. జిల్లాలో 22ఏ, 27బి, 19 సీ కేటగిరి సెంటర్‌లు ఉన్నాయి.
రాహుల్‌రాజ్ మార్క్ ఫలించేనా..!
బదిలీపై వెళ్లిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యాశాఖపై తనదైన ముద్రవేశారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఈ విద్యా సంవత్సరం వందల కొద్ది స్కూల్‌ళ్లు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లను పర్యవేక్షించారు. శతశాతం ఉత్తీర్ణత సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ క్రమంలో నవంబర్ నుంచి స్పెషల్ క్లాసులు ప్రారంభించారు. పీఎంశ్రీ స్కూల్ విద్యార్థులకు స్నాక్స్ మొదట్నుంచీ అందించగా, ఇతర పాఠశాలల్లో గత నెల 15 నుంచి ప్రారంభించారు. వెనుక బడిన విద్యార్థుల దత్తత కార్యక్రమాన్ని కొనసాగించారు. సీ గ్రేడ్ విద్యార్థుల కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తయారు చేయించారు. ప్రీ ఫైనల్‌తో పాటు, గతేడాది సెకండ్ సెట్ పేపర్‌తో సమాయత్త పరీక్షలు నిర్వహించారు. డీఈఓ విజయ సైతం ప్రతి పాఠశాలను సందర్శిస్తూ.. ఉపాధ్యాయులు.విద్యార్థుల్లో స్ఫూర్తి రగిలించారు.
227 పాఠశాలలు.. 11,247 విద్యార్థులు
68 పరీక్ష కేంద్రాలు.. సీసీ కెమెరాల ఏర్పాటు
14 నుంచి పరీక్షలు ప్రారంభం
సీసీ కెమెరాల నీడన పరీక్షలు
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు, ప్రతి సెంటర్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాం. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. పరీక్షలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా రాసేలా మానసిక సన్నద్ధత సాధించాలి. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, సూపరింటెండెంట్ల దృష్టికి తీసుకెళ్లాలి.
–విజయ, డీఈఓ


