అదనపు కలెక్టర్ నగేశ్
రామాయంపేట(మెదక్): జిల్లాలోని 24 గ్రామాల్లో భూముల రీ సర్వే కొనసాగుతోందని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. మంగళవారం మండలంలోని అక్కన్నపేట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన భూముల రీసర్వే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సర్వే అనంతరం ప్రతి హక్కుదారుడికి తాజాగా సదరు స్థలాలపై పూర్తి హక్కులు ఏర్పడుతాయని చెప్పారు. కొన్ని గ్రామాల్లో భూములతోపాటు సమస్యలు పెరిగిపోయాయని, రీ సర్వేతో భూములకు సంబంధించి అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. సర్వే విభాగం ఏడీ కిషన్ మాట్లాడుతూ.. సర్వే అనంతరం సంబంధిత రైతుకు భూదార్ కార్డు ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి, డీపీఆర్వో రామచంద్రరాజు, తహసీల్దార్ రజనీ, ఎంపీడీవో సజీలుద్దీన్ సర్పంచ్ యాదగిరి, ఉప సర్పంచ్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
మెదక్ కలెక్టరేట్: ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించామని జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ పేర్కొన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలోని అజంపురా వీధిలో ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. అనంతరం 26 వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా పరిశుభ్రత పాటించాలని, పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. అంతకు ముందుకు మున్సిపల్ ఆధ్వర్యంలో పట్టణంలోని 9వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేష్‌గౌడ్, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు దీపక్‌కుమార్, జుబేర్ పాల్గొన్నారు.
పశుసంవర్ధక శాఖ అధికారి
డాక్టర్ వెంకటయ్య
చిలప్‌చెడ్(నర్సాపూర్): ముందస్తు జాగ్రత్తగా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయాలని, దీంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగి, పశువు ఆరోగ్యంగా, బలంగా తయారవుతుందని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ వెంకటయ్య అన్నారు. మంగళవారం ఆయన చిలప్‌చెడ్ మండలంలోని చిట్కుల్ గ్రామంలో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెంకటయ్య మాట్లాడుతూ.. పాడి రైతులు ప్రతి పశువుకు టీకా ఇప్పించాలన్నారు. పశువుల్లో గర్భకోశ వ్యాధి నివారణ చికిత్సలు చేయించి, సకాలంలో చూడికట్టేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో వెటర్నరీ సర్జన్ డాక్టర్ వినోద్, పశువైద్య సిబ్బంది గట్టయ్య, యాదయ్య, నర్సింలు, సతీష్ పాల్గొన్నారు.
ఐకేపీ ఏపీఎం సంగమేశ్వర్
నర్సాపూర్: మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే వ్యవస్థ బలోపేతం అవుతుందని ఐకేపీ ఏపీఎం సంగమేశ్వర్ చెప్పారు. మంగళవారం ఐకేపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా రాజకీయంగా సామాజిక పరంగా రాణించినప్పుడే వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా మహిళలకు పలు రకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సిబ్బంది మేఘన, షహనాజ్, ప్రవీణ, రవీందర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.


