● హాజరు కానున్న మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు
● కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ కలెక్టరేట్: సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లకు ఈనెల 12న ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి సీఎస్ రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో ప్రజాపాలనా– ప్రగతి ప్రణాళిక కార్యక్రమం గురువారం నిర్వహించనున్న శిక్షణా కార్యక్రమం నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడానికి స్థానిక ప్రజాప్రతినిధులకు సమగ్ర అవగాహన కల్పించడం ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొంటారని చెప్పారు. అనంతరం ప్రగతి ప్రణాళిక అమలుపై సమీక్షించారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం, గ్రామాలు, పట్టణాల్లో శుభ్రత, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్‌లోని పలు శాఖల్లో జరుగుతున్న ఫైళ్ల క్లియరెన్స్‌ను పరిశీలించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
చిన్నశంకరంపేట(మెదక్): ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు. మంగళవారం చిన్నశంకరంపేట తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. పెండింగ్ దరఖాస్తులను ఇన్ని రోజులు ఎందుకు అలా వదిలేశారని అధికారులను ప్రశ్నించారు. వారం రోజుల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటిని పరిష్కరించాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.


