● ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
● పోలీసు వార్షిక క్రీడోత్సవాలు ప్రారంభం
మెదక్ కలెక్టరేట్: క్రీడలతో ఒత్తిడిని జయించవచ్చునని, శారీరక ధృడత్వానికి ఎంతో అవసరమని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో పోలీసు వార్షిక క్రీడోత్సవాలను నిర్వహించారు. క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం పోలీసు సిబ్బంది నిరంతరం విధులు నిర్వహిస్తూ అనేక సవాళ్లను ఎదుర్కొంటారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నారు. విధుల్లో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని చెప్పారు. క్రీడా పోటీలు సిబ్బందిలో ఐక్యత, జట్టు భావన, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. ఈ క్రీడోత్సవాల్లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్, పరుగుపందెం, లాంగ్ జంప్, షాట్‌పుట్ వంటి పలు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సుభాష్ చంద్ర బోస్, సీఐలు మహేష్, రేణుక రెడ్డి, కృష్ణమూర్తి, జాన్ రెడ్డి, వెంకట రాజా గౌడ్, ఆర్‌ఐలు శైలేందర్, రామకృష్ణ, ఎస్‌ఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మెదక్ పట్టణంలో...
మెదక్‌జోన్: మానసికోల్లాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగ పడుతాయని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరేందర్ పేర్కొన్నాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో మహిళా ఉద్యోగులకు మంగళవారం ఆటల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్జీవో అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ, నిత్యం విధుల్లో నిమగ్నమయ్యే మహిళా ఉద్యోగులకు ఈ క్రీడలు ఎంతగానో దోహదపడుతాయని పేర్కొన్నారు. ఇందులో జ్యూట్ బ్యాగ్, జంపింగ్, మ్యూజికల్ చైర్, త్రెడ్ అండ్ నీడిల్, లెమన్ అండ్ స్పూన్, క్యారమ్స్, స్పీడ్ వాక్, చెస్, టగ్ ఆఫ్ వార్ తదితర క్రీడలు నిర్వహించగా.. ఉద్యోగులు అసక్తితో పోటీలలో పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన విజేతలకు బుధవారం కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ హేమభార్గవి, అధికారులు రమేష్, టీఎన్‌జీవో జిల్లా కార్యదర్శి రాజ్‌కుమార్, సహ అధ్యక్షుడు ఇక్బాల్ పాషా, పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షులు సంతోష్ పాల్గొన్నారు.


