పర్యటించి.. ప్రశ్నలడిగి | - | Sakshi
Sakshi News home page

పర్యటించి.. ప్రశ్నలడిగి

Mar 9 2026 7:11 AM | Updated on Mar 9 2026 7:11 AM

వాకర్స్‌తో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాధిక

స్టార్‌ రిపోర్టర్‌గా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాధిక

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాధిక ‘సాక్షి’ స్టార్‌ రిపోర్టర్‌ అవతారమెత్తారు. శనివారం పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో పట్టణ ప్రజలు, మార్నింగ్‌ వాకర్స్‌ను కలిసి సమస్యలపై ప్రశ్నలు అడిగారు. ఈసందర్భంగా వారు సమస్యలను ఏకరువు పెట్టారు. వాటిలో 90 శాతం పనులు మున్సిపల్‌ పరిధిలో పరిష్కరించేవే ఉన్నాయని, త్వరలోనే వాటికి పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు.

– మెదక్‌జోన్‌

● మెదక్‌ పట్టణానికి బైపాస్‌ రోడ్డు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. పట్టణంలో చిన్నపాటి కార్యక్రమం జరిగినా, గంటల తరబడి ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. కనీసం అంబులెన్స్‌ సైతం బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది.

– నాగభూషణం, పట్టణవాసి

● పట్టణంలోని పార్కులు కొన్ని అన్యాక్రాంతం కాగా, మరికొన్ని ఆక్రమణకు గురయ్యాయి. వాటిని అక్రమార్కుల చెర నుంచి విడిపించి వినియోగంలోకి తీసుకురావాలి. పట్టణవాసులకు ఆహ్లాదం అందించాలి.

– కొండల్‌రెడ్డి, రిటైర్డ్‌ ఉద్యోగి

● మున్సిపాలిటీలో ప్లాస్టిక్‌ వినియోగం విచ్చలవిడిగా పెరిగింది. అన్ని దుకాణాలు, హోటళ్లలో ప్లాస్టిక్‌ కవర్ల చలామణి పెరిగింది. వాటితో కేన్సర్‌ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వాటిని అరికట్టే ప్రయత్నం చేయాలి – శ్రీనివాస్‌, యువకుడు

● కూరగాయల మార్కెట్‌ సమీపంలో నిర్మించిన రైతు బజార్‌ పనులు అర్ధాంతరంగా ఆగిపోవటంతో కూరగాయల వ్యాపారులు, రైతులు రోడ్లమీదనే విక్రయిస్తున్నారు. దీంతో మార్కెట్‌లో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతుంది. రైతుబజార్‌ను పూర్తిస్థాయిలో నిర్మించి సమస్యను పరిష్కరించాలి. – ఆనందం, రిటైర్డ్‌ ఉద్యోగి

● పట్టణంలోని పిట్లం, మల్లెం, బంగ్లా చెరువులు రోజురోజుకు ఆక్రమణకు గురవుతున్నాయి. అంతేకాకుండా వాటిలోకి పట్టణంలోని మురికినీటిని వదులుతున్నారు. వాటిలో చెత్త వేయడంతో దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో భూగర్భజలాలు కలుషితమవుతున్నాయి.

– బాలేశ్వర్‌గౌడ్‌, పట్టణవాసి

● పట్టణంలోని మూడు చౌరస్తాలు, హెడ్‌ పోస్టా ఫీస్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. రోడ్డు విస్తరణలో భాగంగా ఆ ప్రాంతంలోని మహనీయుల విగ్రహాలను తొలగించారు. రోడ్డు మ రమ్మతులు అయినప్పటికీ చౌరస్తాలో సుందరీకరణ పనులు చేయటం లేదు.

– శంకర్‌, పట్టణవాసి

● పట్టణంలో కోతుల బెడద విపరీతంగా ఉంది. వాటి దాడిలో గాయపడి పలువురు ఆస్పత్రుల పాలయ్యారు. వాటిని పట్టి ఇతర ప్రాంతాలకు తరలించి ప్రజలకు రక్షణ కల్పించాలి.

– సంజీవరావు, స్థానికుడు

● మెదక్‌ నుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్లే దారిలో వీధి లైట్లు వెలగకపోవడంతో రాత్రి వేళ చిమ్మ చీకట్లు అలుముకుంటున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వెంటనే లైట్లు అమర్చి సమస్యను పరిష్కరించాలి. అలాగే రూ. కోట్లు వెచ్చించి నిర్మించిన సింథటిక్‌ ట్రాక్‌ వృథాగా మారింది. దీనిపై చర్యలు తీసుకోవాలి.

– సిద్దన్న, రవి

సమస్యలు ఏకరువు పెట్టిన వాకర్స్‌

వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement