● భారీగా పెరిగిన వంటగ్యాస్ ధర ● తాజాగా ఒక్కో సిలిండర్‌పై రూ.60 పెంపు ● ఉమ్మడి మెదక్ జిల్లాలో వినియోగదారులపై రూ. 3 కోట్ల భారం
సాక్షి, సిద్దిపేట: సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై ఏకంగా రూ. 60, కమర్షియల్ సిలిండర్‌పై రూ. 115 పెంచింది. దీంతో శనివారం నుంచి కొత్త ధరలకే గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నారు. ఇప్పటికే బియ్యం, నూనె, పప్పులు వంటి నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ఈక్రమంలో తాజాగా పెరిగిన గ్యాస్ ధర మరింత భారం కానుంది. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ రూ. 922 ఉండగా, రూ. 60 పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో రూ. 982కు చేరింది. సంగారెడ్డిలో రూ. 905 ఉండగా, ప్రస్తుతం రూ. 965కు చేరింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 11,56,140 గృహ గ్యాస్ కనెక్షన్లు ఉండగా, అందులో ప్రతి నెల ఒక్కో సిలిండర్ చొప్పున 5 లక్షల మంది వినియోగిస్తున్నారు. దీంతో ఆ కుటుంబాలపై ప్రతి నెల దాదాపు రూ. 3 కోట్ల భారం పడనుంది. ఉజ్వల పథకం కింద తీసుకున్న కనెక్షన్ల ధరలో ఎలాంటి మార్పు లేదని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రేషన్ కార్డు కలిగిన పేద, మధ్య తరగతి కుటుంబాలకు రూ. 500కు సిలిండర్‌ను అందజేస్తోంది. మహాలక్ష్మి లబ్ధిదారుల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే ఈ ధర ప్రభావం ప్రభుత్వం పై ఎక్కువగా పడనుంది.
జిల్లా గ్యాస్ కనెక్షన్లు ప్రస్తుత ధర
సిద్దిపేట 3,33,850 రూ. 982
మెదక్ 2,35,412 రూ. 982
సంగారెడ్డి 5,86,878 రూ. 965


