వ్యూహాలకు పదును
వైఫల్యాలను ఎండగడుతున్న బీఆర్‌ఎస్
మెదక్‌జోన్: మున్సిపల్ ఎన్నిల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులెవరో తేలడంతో పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎలాగైనా తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం యత్నిస్తున్నారు. జిల్లాలో మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 75వార్డులున్నాయి. మెదక్ మున్సిపాలిటీలోని ఒక వార్డు ఏకగ్రీవం కాగా 74 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు, బీఆర్‌ఎస్ అగ్రనేత హరీశ్‌రావులు ప్రత్యేక దృష్టి సారించారు. ఒకటికి నాలుగుసార్లు సర్వేలు చేయించి అభ్యర్థులకు బీఫాంలు అందజేశారంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్లే తెలుస్తుంది. బీజేపీ సైతం యువతే లక్ష్యంగా పెట్టుకొని బరిలో దిగింది. జిల్లాలో ఆ పార్టీ ఇప్పటి వరకు 70వార్డులో అభ్యర్థులను నిలబెట్టింది. గడిచిన సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అధిక సర్పంచ్ స్థానాలు కై వసం చేసుకోవడంతో ఈ పుర ఎన్నికలను కాంగ్రెస్‌పార్టీ చాలెంజ్‌గా తీసుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిదని బీఆర్‌ఎస్ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. రైతు రుణమాఫీ 40శాతం మందికి కూడా కాలేదని, యాసంగి పంటల సాగు సమయం దగ్గరికి వస్తున్నా.. నేటికి రైతు భరోసా ఇవ్వడం లేదని, ప్రతి మహిళకు ఇస్తామన్న రూ.2500లు ఏవని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లకు ఇస్తామన్న తులం బంగారం ఏమైందని నిలదీస్తున్నారు. కొత్త పింఛన్‌లు తదితర అంశాలను ఫోకస్ చేస్తున్నారు.
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వస్తుందంటూ బీజేపీ నేతలు యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు పార్టీలు ప్రజలు మోసం చేసి అడ్డదారిలో అధికారంలోకి వచ్చాయని విమర్శిస్తున్నారు. అధికార పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు ఎప్పుడని ప్రశ్నిస్తున్నారు.
మోదీ జపంతో బీజేపీ
పార్టీల ఎత్తుకు పైఎత్తులు
రంగంలోకి ముఖ్య నేతలు
రసవత్తరంగా ‘పుర’పోరు
సంక్షేమ పథకాలపైనే కాంగ్రెస్ నజర్
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధే కాంగ్రెస్‌ను గెలిపిస్తుందని అఽధికార పార్టీ నేతలు గట్టి ధీమాతో ఉన్నారు. గడిచిన రెండేళ్లలో రుణమాఫీతో మొదలుకొని ఆరు గ్యారంటీలలో భాగంగా ఉచిత బస్సు, గ్యాస్, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, అభివృద్ధికోసం పెద్ద ఎత్తున నిధుల విడుదలపై ప్రచారం మొదలు పెట్టింది. మరో మూడేళ్లపాటు అధికారంలో ఉంటామని, అభివృద్ధి తమతో సాధ్యమని అధికార పార్టీ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు.


