అర్ధాంగి.. అదిగదిగో అందలం!
మెదక్ కలెక్టరేట్: గతంలో భర్తలు ఎన్నికల్లో పోటీ చేస్తుంటే వారి భార్యలు ఇంటింటికి తిరిగి మహిళలకు బొట్టుపెట్టి ఓట్లు అభ్యర్థించేవారు. రిజర్వేషన్ల పుణ్యమా అని ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో మహిళలకు 50శాతం సీట్లు కేటాయించారు. దీంతో భార్యలు పోటీ చేస్తుంటే వారి గెలుపు కోసం భర్తలు ప్రచారాలు కొనసాగిస్తున్నారు. అర్థాంగిని అందలం ఎక్కించేందుకు వారి వెంట జెండా పట్టుకొని ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.
16 మంది మహిళా అభ్యర్థులు
మెదక్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 32 వార్డులు ఉండగా ఎన్నికల కమిషన్ 50శాతం మహిళలకే కేటాయించింది. దీంతో ఆయా పార్టీలు నుంచి 16 మంది మహిళా అభ్యర్థులు పోటిలో నిలబడ్డారు. కాగా మహిళా అభ్యర్థులు పోటీచేసే చోట్ల సతి గెలుపుకోసం పతులు పాట్లు పడుతున్నారు. ఇందులో కొంతమంది తమ వారిని చైర్ పర్సన్ చేయాలనే తపనతో మరింత విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. మెదక్ మున్సిపల్ పరిధిలోని 1, 3, 4, 7, 8, 10, 11, 12, 13, 14, 17, 21, 23, 27, 28, 32 వార్డుల్లో ఆయా పార్టీలు మహిళలకు కేటాయించాయి. మహిళా అభ్యర్థుల కోసం వారి భర్తలు, కొడుకులు అభ్యర్థుల కంటే ఎక్కువగా పర్యటిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు.
మాజీ చైర్మన్లు సైతం
మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి భార్య బట్టి లలిత 17వ వార్డు అభ్యర్థిగా నిలబడ్డారు. మెదక్ మున్సిపల్ చైర్మన్‌గా మూడుసార్లు పనిచేసిన బట్టి జగపతి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా తన భార్య లలిత గెలుపు కోసం కష్ట పడుతున్నారు. అలాగే మరో మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ భార్య మాజీ కౌన్సిలర్ గాయత్రి 15వ వార్డు అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. మల్లికార్జున్‌గౌడ్ సైతం ఎన్నికల్లో పోటీచేయకుండా అతని భార్య గాయత్రిని అందలం ఎక్కించే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఆమెను గెలిపించి బీఆర్‌ఎస్ తరపున చైర్మన్ చేయాలనే తపనతో విస్తృత ప్రచారం చేస్తున్నారు. అలాగే 14వ వార్డులో దొంతి లక్ష్మిని గెలిపించడం కోసం ఆమె భర్త దొంతి ముత్యంగౌడ్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు 27వ వార్డులో ఎమ్మార్పీఎస్ నాయకుడు బాల్‌రాజ్ తన భార్య రాణి గెలుపుకోసం ప్రచారం చేస్తుండగా, 10వార్డులో చింతల నర్సింలు తన కోడలు గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఇదే వార్డులో వనం వెంకటేశం తన భార్య లత గెలుపు కోసం పరుగులు పెడుతున్నారు.
మొదటి ఏకగ్రీవం
మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డు కౌన్సిలర్‌గా గోదల మానస పోటీ చేయగా తన భార్య గెలుపుకోసం భర్త గోదల సాయిరాంవిస్తృతంగా కృషి చేశారు. ఈ క్రమంలో పార్టీ అధినాయకుల సహకారంతో ప్రత్యర్థిగా ఉన్న జ్యోతిని పోటీ నుంచి తప్పించి రెండోసారి ఏకగ్రీవ కౌన్సిలర్‌గా మానస ఎన్నికయ్యారు.
పుర పీఠం కోసం ముమ్మర యత్నాలు
సతుల పోరు.. పతుల పాట్లు
32 వార్డుల్లో సగం మహిళా అభ్యర్థులే


