రాష్ట్రంలో తుగ్లక్ పాలన
మెదక్‌జోన్: రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం మెదక్ పట్టణంలోని పలు వార్డుల్లో ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప గడిచిన రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమి లేదన్నారు. ఆరు గ్యారంటీలతోపాటు 420 అబద్ధపు హామీలను ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. వృద్ధులకు ఇస్తామన్న రూ.4వేల పెన్షన్, 18యేళ్లు నిండిన ప్రతి మహిళకు ఇస్తామన్న రూ.2,500లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లకు ఇస్తామన్న తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు. భారీ వర్షాలతో తెగిపోయిన కుంటలకు, చెరువులకు మరమ్మతులు చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. కేసీఆర్‌ను ఓడించినందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం స్పష్టంగా కనిపిస్తుందన్నారు.
బీఆర్‌ఎస్ అధ్యక్షురాలు పద్మారెడ్డి


