
శేఖర్ .. సమయస్ఫూర్తి
● శమ్నాపూర్ బ్రిడ్జి కింది భాగంలో కొట్టుకుపోయిన మట్టి, కంకర ● అక్కన్నపేట– మెదక్ మధ్య ఘటన ● తప్పిన ప్రమాదం.. నిలిచిన రైళ్ల రాకపోకలు
రామాయంపేట/హవేళిఘణాపూర్(మెదక్)/మెదక్‌జోన్: భారీ వర్షాలతో దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌లతో సికింద్రాబాద్– నిజామాబాద్, అక్కన్నపేట– మెదక్ మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాక్‌లను ఆనుకొని ఉన్న చెరువులు, వాగుల్లో నీరు నిండి పెద్ద ఎత్తున వరద పోటెత్తింది. అక్కన్నపేట– మెదక్ మార్గంలో శమ్నాపూర్ బ్రిడ్జి కింది భాగంలో మట్టి, కంకర వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో పట్టాలు గాలిలో తేలియాడాయి.
సమాచారం అందించిన రైతు
గ్రామానికి చెందిన శేఖర్ రైతు బుధవారం ఉద యం 11.15 గంటలకు రైల్వేకట్ట ప్రాంతంలోని తన వ్యవసాయ పొలాన్ని చూసేందుకు వెళ్లాడు. నీటి ఉధృతితో రైలు పట్టాల కింద మట్టి, కంకర కొట్టుకపోయిన విషయాన్ని గమనించాడు. ఈ విషయాన్ని ఫోన్‌లో పోలీసులకు సమాచారం అందించాడు. అప్పటికే ఉదయం 5.30 గంటల రైలు వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న రైల్వే(కీ) మెన్ ఘటన స్థలిని పరిశీలించి స్టేషన్ మాస్టర్‌కు వివరించారు. దీంతో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేశా రు. ఒక వేళ దీనిని గమనించకుండా ఉంటే పెను ప్రమాదం జరిగేది. అప్పటికే వెళ్లిపోయిన రైళ్లను ఎక్కడికక్కడే సమీప స్టేషన్లలో నిలిపివేశారు. యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించినా, కనీసం రెండు, మూడు రోజులైనా సమయం పట్టవచ్చని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు.