
ఏమైనా ఇబ్బందులున్నాయా..?
ఖైదీలతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి
మెదక్ కలెక్టరేట్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ బుధవారం మెదక్ సబ్ జైలును ఆకస్మికంగా సందర్శించారు. ఖైదీలతో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం ఎలా ఉంది.. అన్ని వసతులు కల్పిస్తున్నారా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అంటూ ఆరా తీశారు. ఈసందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. మీరు తప్పులు చేసి జైలుకు వస్తే మీ కుటుంబాలు మానసిక క్షోభకు గురవుతాయన్నారు. ఒకసారి జైలు నుంచి బయటకు వెళ్లాక సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ఆమె వెంట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ సుభవల్లి, జైలు సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.