
జిల్లాలో 48 మద్యం దుకాణాలు
మద్యం దుకాణాల లైసెన్స్‌ల జారీకి నోటిఫికేషన్
2025 డిసెంబర్ నుంచి 2027 నవంబర్ వరకు..
ఈ ఏడాది నవంబర్‌తో ముగియనున్న గడువు
గౌడ్‌లకు 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్
మెదక్ అర్బన్: మద్యం దుకాణాల లైసెన్స్‌లకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. దర ఖాస్తు ఫీజును రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచారు. 2025 డిసెంబర్ నుంచి 2027 నవంబర్ వరకు రెండేళ్ల పాటు వ్యాపారం చేసుకునేందుకు ఎక్సైజ్ పాలసీ ఖరారు అయ్యింది. ఈసారి గౌడ్‌లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా మద్యం షాపుల లైసెన్స్‌లకు భారీ డిమాండ్ ఉండనుంది. జిల్లాలో 48 వైన్ షాపుల కోసం వేలాది దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.
భారీగా పెరిగిన దరఖాస్తు ఫీజు
ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారిన ఎకై ్సజ్ శాఖ టెండర్లపై వ్యాపారులు ఆసక్తిగా ఉన్నారు. రోజు రోజుకు మద్యం వినియోగం పెరుగుతుండటం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయన్న ఆశతో ఈసారి వైన్ షాపులకు భారీగా దరఖాస్తులు వచ్చే అవకాఽశం ఉంది. గతంలో నవంబర్‌లో సాధారణ ఎన్నికల దృష్ట్యా ఆగస్టులోనే నోటిఫికేషన్ వేశారు. కొత్త షాపులు మాత్రం డిసెంబర్‌లో ప్రారంభం అయ్యాయి. అప్పట్లో జిల్లాలోని పోతంషెట్‌పల్లి వైన్ షాపుకు అత్యధికంగా 111 దరఖాస్తులు వచ్చాయి.
అలాగే గతంతో పోలిస్తే ఈసారి లైసెన్స్ దరఖాస్తు ఫీజును కూడా రూ. 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచారు. ఇక వైన్ షాపుల కేటాయింపులో కూడా రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా వైన్ షాపులను ఆరు స్లాబ్‌లుగా వర్గీకరించారు. 2011 జనాభా ఆధారంగా ఈ స్లాబ్‌లు విభజించారు. 5 వేల జనాభా వరకు రూ. 50 లక్షలు, 5 వేల నుంచి 50 వేల జనాభా వరకు రూ. 55 లక్షలు, 50 వేల నుంచి 1 లక్షా జనాభా వరకు రూ. 60 లక్షలు, లక్ష నుంచి 5 లక్షల జనాభా వరకు రూ. 65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా వరకు రూ. 85 లక్షలు, 20 లక్షలకు పైగా జనాభా ఉంటే రూ. 110 లక్షలు ఏడాది కాలానికి లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని వైన్‌షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఈ విషయమై జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డిని ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.