
అదనపు బస్సుల కోసం ఆందోళన
చేగుంట(తూప్రాన్): అదనపు బస్సులు నడపాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు బుధవారం మోడల్ పాఠశాల వద్ద రాస్తారోకో నిర్వహించారు. బీ. కొండాపూర్ నుంచి చేగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు బోనాల్, ఇబ్రహీంపూర్, రుక్మాపూర్, అనంతసాగర్, ఉల్లితిమ్మాయిపల్లి, అనంతసాగర్ గ్రామాలకు చెందిన విద్యార్థులు వస్తుంటారు. ఈరూట్‌లో మోడల్ పాఠశాల బస్సు ఒక్కటి మాత్రమే నడుస్తుండటంతో దాదాపు 200కు పైగా విద్యార్థులు ఒక్క బస్సులో వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల అవి సైతం అందుబాటులో లేకపోవడంతో కళాశాలకు హాజరుకాలేక పోతున్నారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు మోడల్ పాఠశాల సమీపంలో ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి.. వారం రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు.