
ఏసీబీకి చిక్కిన జీఎస్టీ అధికారి
● లంచం తీసుకుంటుండగా పట్టివేత ● అరెస్ట్ చేసి నాంపల్లి సీబీఐ కోర్టుకు తరలింపు
మెదక్‌జోన్: జిల్లా కేంద్రంలోని జీఎస్టీ (కేంద్ర) కార్యాలయ సూపరింటెండెంట్ రవిరంజన్ అగర్వాల్ ఏసీబీకి చిక్కారు. శుక్రవారం ఓ వ్యాపారి వద్ద లంచం తీసుకుంటుండగా సీబీఐ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సుమారు ఆరుగంటల పాటు విచారించి, సదరు అధికారిని హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దశంకరంపేట మండలం గొట్టిముక్కుల గ్రామానికి చెందిన తలారి కృష్ణమూర్తి ఆరేళ్లుగా ఎలక్ట్రికల్స్, ఇంజనీర్ హార్డ్‌వేర్ షాపును కొనసాగిస్తున్నాడు. కాగా ఏటా జీఎస్టీ రిటర్న్ దా ఖలు చేయలేకపోయాడు. దీంతో జీఎస్టీ సూపరింటెండెంట్ రవిరంజన్ అగర్వాల్ సదరు వ్యాపారికి ఫోన్ చేసి జీఎస్టీ నంబర్‌ను వెంటనే పునరుద్ధరించుకోవాలని సూచించారు. దీంతో సదరు వ్యాపారి ఆన్‌లైన్‌లో రిటర్న్ చేశారు. కానీ దానిని ఓకే చేసేందుకు సదరు అధికారి రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో వ్యాపారి రూ. 8 వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇదే విషయాన్ని ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వారి సూచన మేరకు శుక్రవారం అధికారికి లంచం ఇస్తుండగా, అప్పటికే మాటు వేసిన ఏసీబీ అధికారి ధనుంజయ బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అధికారిని విచారించారు. అనంతరం అరెస్ట్ చేసి తీసుకెళ్తునట్లు పట్టణ పోలీసులకు లెటర్ ద్వారా సమాచారం ఇచ్చారు. అయితే మీడియాను అనుమతించకపోగా, కనీస సమాచారం ఇవ్వలేదు.